సర్పంచ్ ప్రవళిక అరెస్టుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
అరెస్టును ఖండించిన లక్ష్మణ్‌బాబు, బడే నాగజ్యోతి
సమగ్ర విచారణకు డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం: తాడ్వాయి సర్పంచ్ ప్రవళిక అరెస్టును బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని మండిపడ్డారు. ప్రవళిక అరెస్టు విషయం తెలిసిన వెంటనే లక్ష్మణ్‌బాబు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆమె విడుదలకు చొరవ తీసుకున్నారు. ప్రజల తరఫున సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రజాప్రతినిధుల బాధ్యతని బడే నాగజ్యోతి పేర్కొన్నారు. ప్రవళిక అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని, ఆమెకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల గొంతుకలను అణచివేయాలని చూస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, ప్రజల హక్కులు, ప్రజాప్రతినిధుల గౌరవం కోసం నిరంతరం పోరాడుతుందని ఇరువురు స్పష్టం చేశారు.

