చుంచుపల్లి పీహెచ్సీని తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ
వైద్య సేవలు, మందుల నిల్వలు, పారిశుద్ధ్యంపై పరిశీలన
కాకతీయ ఏటూరునాగారం: ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, పారిశుద్ధ్య పరిస్థితులు, మందుల నిల్వలను పరిశీలించారు. మందుల నిల్వలకు సంబంధించిన రిజిస్టర్లు, వ్యాక్సిన్ల భద్రత కోసం ఏర్పాటు చేసిన రిఫ్రిజిరేటర్ నిర్వహణను తనిఖీ చేసి, వాటి వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, మందులు, వ్యాక్సిన్ల నిల్వల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.

