రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మ్యకల ఎల్లయ్య
– కరెంట్ కోతలు, సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంటలు
– రైతుబంధు, రైతుబీమాపై ఇచ్చిన హామీలను అమలు చేయాలి
– కాళేశ్వరం జలాలను ఎత్తిపోసి వేసవి పంటలకు సాగునీరు అందించాలి
రైతుల సమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేస్తాం: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
కాకతీయ, చందుర్తి : ఎన్నికల సమయంలో అమలుకాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చందుర్తి మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు మ్యకల ఎల్లయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలకు సరైన విద్యుత్ సరఫరా లేక, వస్తున్న అరకొర కరెంటుతో మోటార్లు కాలిపోతూ, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఏటా రెండు పంటలకు రైతుబంధు అందించడమే కాకుండా, రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమాను అమలు చేసిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూడు పంటలకు రైతుబంధు కింద ఎకరాకు రూ. 15,000 ఇస్తామని గొప్పలు చెప్పి, ఇప్పుడు రైతుబంధుతో పాటు రైతుబీమాను సైతం అటకెక్కించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో చెరువులు, బావులు, భూగర్భ జలాలు అడుగంటిపోతున్న వేళ, కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాల్సింది పోయి, 750 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా పట్టిసీమ ద్వారా ఏపీకి నీటిని తరలించుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. బొగ్గు కొరత, ఎల్నినో అంటూ సాకులు చెబుతూ కాంగ్రెస్ నాయకులు రైతులను వేసంగి పంటలు వేసుకోవద్దని వేడుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పంటలు వేయవద్దని చెప్పిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే కాళేశ్వరం జలాలను ఎత్తిపోసి వేసవి పంటలకు సాగునీరు, నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలని, విద్యుత్ కోతలతో ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిలబడి పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

