ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!
190 బస్తాల మిర్చి ధరలో భారీ వ్యత్యాసం
బహిరంగ మార్కెట్లో రూ.34 వేలు.. రికార్డుల్లో సగానికి సగం తగ్గింపు
మార్కెట్ ఫీజు ఎగవేతకు వ్యాపారుల యత్నం
ఆధారాలతో ‘కాకతీయ’ కథనం.. పాలకవర్గం కీలక నిర్ణయం
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
మార్కెట్ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరల వ్యత్యాసం చూపిస్తూ మార్కెట్ ఫీజు ఎగవేతకు పాల్పడిన ఇద్దరు వ్యాపారుల లైసెన్సులను రద్దు చేస్తూ మార్కెట్ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. 190 బస్తాల మిర్చికి బహిరంగ మార్కెట్లో రూ.34 వేల ధర పలికినా, రికార్డుల్లో మాత్రం సగానికి సగం తగ్గించి చూపిన వ్యవహారంపై ‘ఉత్తరం కాకతీయ’ సెప్టెంబర్ 25న ఆధారాలతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన మార్కెట్ పాలకవర్గం గురువారం సమావేశమై చర్యలకు నిర్ణయం తీసుకుంది. కోల్డ్ స్టోరేజీ నుంచి తరలించిన 190 బస్తాల మిర్చికి బహిరంగ మార్కెట్లో పలికిన ధరకు, రికార్డుల్లో చూపిన ధరకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. 105 బస్తాలకు రూ.14,500, మరో 85 బస్తాలకు రూ.15,000గా నమోదు చేసినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 190 బస్తాలకు మార్కెట్ ధర రూ.34 వేలు పలికినప్పటికీ, రికార్డుల్లో తక్కువ ధర చూపడం ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఒక శాతం మార్కెట్ ఫీజును ఎగవేసేందుకు ప్రయత్నించినట్లు మార్కెట్ పాలకవర్గం గుర్తించింది.

ఇద్దరు వ్యాపారులపై చర్యలు
ఈ వ్యవహారంలో దడావాయి కొమ్ము మురళి (లైసెన్స్ నంబరు 62), సత్యనారాయణ బజాజ్కు సంబంధించిన లైసెన్సులపై మార్కెట్ కమిటీ చర్యలు చేపట్టింది. సత్యనారాయణ బజాజ్, సురేష్ స్పైసెస్ ట్రేడింగ్ పేర్లతో వ్యవహారానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. లైసెన్సుల రద్దుకు సంబంధించి అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్న పూర్తి వివరాలను మార్కెట్ కమిటీ వెల్లడించాల్సి ఉంది. ఏనుమాముల మార్కెట్లో ధరల వ్యత్యాసంతో జరుగుతున్న ‘జీరో దందా’ను ‘ఉత్తరం కాకతీయ’ సెప్టెంబర్ 25న సాక్ష్యాధారాలు, స్టాక్ రిజిస్టర్ నకళ్లతో వెలుగులోకి తెచ్చింది. బహిరంగ మార్కెట్ ధరకు, వేబ్రిడ్జి స్లిప్పుల్లో చూపిన ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కథనంలో వివరించింది. ఈ కథనం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారితీయడంతో పాలకవర్గం వ్యవహారాన్ని పరిశీలించినట్లు సమాచారం. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక అధ్యక్షతన గురువారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ‘కాకతీయ’ కథనంలో ప్రచురితమైన ఆధారాలను పరిశీలించిన అనంతరం సంబంధిత వ్యాపారుల లైసెన్సులపై చర్యలు తీసుకోవాలని తీర్మానించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించినా, మార్కెట్ కమిటీ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేసినా ఉపేక్షించబోమని చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లు సమాచారం. మార్కెట్లో ధరల నమోదు, స్టాక్ వివరాలు, ఫీజుల వసూళ్లపై నిరంతర పర్యవేక్షణ అవసరమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.


