జనగామలో బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి, పల్లా
కాకతీయ, జనగామ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకాంక్షించారు. జనగామ పట్టణంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. మహిళలు, స్థానికులతో కలిసి సంబరాల్లో భాగస్వాములయ్యారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ వార్డులకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

