20న ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
మధ్యాహ్నం 3 నుంచి 21న తెల్లవారుజామున 3 గంటల వరకు అమలు
భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు
భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
ఎన్. శ్వేత, వరంగల్ పోలీస్ కమిషనర్
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంగా ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటల నుంచి 21న తెల్లవారుజామున 3 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని, ఉర్సు గుట్టకు వచ్చే భక్తులు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని సూచించారు. ఖమ్మం నుంచి వరంగల్ మీదుగా కరీంనగర్, హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు ఫున్నెలు క్రాస్ నుంచి ఐనవోలు ఆర్చ్, వెంకటాపురం, కరుణాపురం మీదుగా వెళ్లాలని కమిషనర్ సూచించారు. కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు కేయూసీ, పెద్దమ్మగడ్డ, హనుమాన్ జంక్షన్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్ రోడ్ జంక్షన్ మీదుగా ప్రయాణించాలి. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, ఫున్నెలు క్రాస్ మీదుగా వెళ్లాలని తెలిపారు.
భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్
ఉర్సు గుట్టకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎన్. శ్వేత వివరించారు. హనుమకొండ హంటర్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను కొలంబో ఆసుపత్రి, బీఆర్ నగర్ ఎదురుగా గానుగ ఆయిల్ పాయింట్ సమీపంలో, ఆకుతోట ఫంక్షన్ హాల్, నాని గార్డెన్, జేఎస్ఎం పాఠశాల వద్ద పార్కింగ్ చేసుకోవాలి. కడిపికొండ నుంచి వచ్చే వాహనాలకు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో, ఆర్టీఓ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలకు లవ్లీ ఫంక్షన్ హాల్ ఓపెన్ ప్లేస్, తాళ్ల పద్మావతి కళాశాల వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కరీమాబాద్ నుంచి వచ్చే వాహనాలను భీరన్న గుడి సమీపంలో నిలపాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలను వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ కోరారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

