రూ.5లక్షల విలువైన ఎండు గంజాయి పట్టివేత
కేసముద్రం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
కాకతీయ, కేసముద్రం: ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించేందుకు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కేసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10.165 కిలోల ఎండు గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అక్టోబర్ 17న ఉదయం 10.50 గంటలకు కేసముద్రం పోలీస్స్టేషన్ పరిధిలోని జ్యోతిరావు ఫూలే సెంటర్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న రెండు బ్యాగులు, ఒక చేతి సంచిలో బ్రౌన్ రంగు టేపుతో ప్యాక్ చేసిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి హైదరాబాద్లో విక్రయించడం ద్వారా లాభాలు పొందాలని నిందితులు ప్రణాళిక వేసుకున్నట్లు వెల్లడైంది. అరెస్టయిన వారిలో హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ హరిజనవాడకు చెందిన కుమ్మరి నితిన్ (23), మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం ఉప్పరపల్లికి చెందిన తాండ్ర బాలకృష్ణ (21), జేజల అభినాష్ (21) ఉన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాల సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు.

