ములుగు మత్తులో.. సిండికేట్ సత్తా!
జిల్లాలో 2,700లకు పైగా బెల్ట్ షాపులు
ప్రతీ గ్రామంలో అనధికారికంగా వైన్‌షాపులు
29 వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు సరఫరా
సిండికేట్ గుప్పిట్లో మద్యం వ్యాపారం
బెల్ట్ షాపుల్లో రూ.20 నుంచి రూ.30ల అదనం
ఫుట్ బాటిళ్లంపై రూ.50 నుంచి రూ.100 వరకు పెట్టాల్సిందే
కొరవడిన ఎక్సైజ్ శాఖ అధికారుల నిఘా
మామూళ్ల మత్తే కారణమంటున్న జిల్లా వాసులు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లాలో మద్యం వ్యాపారం మూడు బాటిళ్లు.. ఆరు బెల్ట్ షాపులన్న చందంగా సాగుతోంది. ప్రభుత్వ అనుమతితో నడిచే వైన్స్‌ల నుంచి గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యం యథేచ్ఛగా చేరుతోంది. ఈ వ్యవహారంలో సిండికేట్ నిర్వాహకులదే పైచేయిగా మారింది. జిల్లాలో 29 వైన్స్ షాపులుండగా.. 2,700కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. పది మండలాలు.. 335 గ్రామాల పరిధిలో అనధికారిక మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అక్రమ విక్రయాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగం ఏం చేస్తోంది? బెల్ట్ దందా ఇంతగా విస్తరించడానికి కారణాలేంటి? అన్న ప్రశ్నలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మద్యం కొనాలంటే నిర్ణీత ధరకు మించి చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30, ఆఫ్ బాటిల్‌పై రూ.40 నుంచి రూ.50, ఫుల్ బాటిల్‌పై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో అధికారిక వైన్స్ అందుబాటులో లేకపోవడం, రాత్రి వేళల్లో మద్యం అవసరమయ్యే పరిస్థితులను కొందరు నిర్వాహకులు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఒకవైపు నిర్ణీత ధరలకు మద్యం విక్రయించాల్సిన నిబంధనలు.. మరోవైపు అదనపు వసూళ్ల దందా.. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యేక స్టిక్కర్లు.. ఎవరి పరిధి వారిదేనా?
బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసేందుకు కొందరు నిర్వాహకులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైన్స్ నిర్వాహకులే వాహనాల ద్వారా మద్యం తరలిస్తున్నారు. బాటిళ్లపై ప్రత్యేక స్టిక్కర్లు వేసి, ఏ ప్రాంతానికి చెందిన సరుకో గుర్తించేలా వ్యవహరిస్తున్నారు. సిండికేట్ నిర్వాహకులు తమ పరిధులను పంచుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం తీసుకువచ్చే వారిపై చర్యలు తీసుకుంటున్న అధికారులు.. స్థానిక వైన్స్‌ల నుంచే బెల్ట్ షాపులకు సరఫరా జరుగుతోంది. కొన్ని వైన్స్‌లు మధ్యాహ్నం 12 గంటలకే తెరిచి, సాయంత్రం 4.30 గంటలకే మూసివేస్తుండటం గమనార్హం. ఈ సమయంలో మద్యం ఎక్కడికి తరలుతోంది? విక్రయాల లెక్కలు, నిల్వలు సరిపోతున్నాయా? అన్న అంశాలపై తనిఖీలు జరగాల్సి ఉంది. బెల్ట్ షాపుల వ్యవహారంపై నెలవారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి.

దందాకు అడ్డుకట్ట ఎప్పుడు?
జిల్లాలో బెల్ట్ షాపుల సంఖ్య, మద్యం సరఫరా మార్గాలు, వైన్స్‌ల విక్రయాల లెక్కలపై సమగ్ర పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది. 29 వైన్స్‌ల నుంచి ఇంత విస్తృతంగా మద్యం సరఫరా జరుగుతోందనే ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ వాస్తవాలను వెల్లడించాలి. బెల్ట్ షాపులపై తనిఖీలు నిర్వహించి, అదనపు ధరల వసూళ్లు, అక్రమ రవాణా, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మద్యం వ్యాపారంలో అక్రమాలకు తావులేకుండా పారదర్శక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. బెల్ట్ దందా ఆరోపణలపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? సిండికేట్ వ్యవహారంపై తనిఖీలు ఎప్పుడు మొదలవుతాయి? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

