ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం
ప్రజల కోసం పోరాడినవారు గుండెల్లో నిలిచిపోతారు
హైకోర్టు న్యాయవాది, విగ్రహదాత డాక్టర్ నలమాస కృష్ణ గౌడ్
శ్రీరామగిరిలో వీరనారి విగ్రహావిష్కరణ
కాకతీయ, నెల్లికుదురు: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శంగా నిలవాలని హైకోర్టు న్యాయవాది, విగ్రహదాత డాక్టర్ నలమాస కృష్ణ గౌడ్ అన్నారు. శనివారం శ్రీరామగిరి గ్రామంలో చాకలి ఐలమ్మ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని నలంద విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ డోలి సత్యనారాయణ, మానుకోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ప్రజల హక్కులు, న్యాయం కోసం పోరాడినవారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. సబ్బండ వర్గాల కోసం త్యాగం చేసిన ఐలమ్మను వీరనారిగా స్మరించుకోవడం గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్లోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ఆమె పోరాట వారసత్వానికి గుర్తింపు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మాదారి ప్రశాంత్, సంఘం అధ్యక్షుడు సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి మడిపెద్ది ముఖేష్, పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

