బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక
తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం పూల పండుగ
మహిళల ఐక్యత, ఆత్మగౌరవానికి నిదర్శనం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కాకతీయ, హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సామాజిక న్యాయం, సమానత్వం, మహిళల ఐక్యతకు ప్రతిరూపమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మకు ప్రతిరూపమని పేర్కొన్నారు. వివిధ రకాల పూలు కలిసి బతుకమ్మగా రూపుదిద్దుకున్నట్లే భిన్న వర్గాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలను ఈ పండుగ ఒక్కతాటిపైకి తెస్తుందని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. సద్దుల బతుకమ్మ ప్రతి ఇంటా ఆనందాలు నింపాలని, కుటుంబాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తరతరాల పాటు కొనసాగాలని, బతుకమ్మ మహిళల ఐక్యతకు, సామాజిక సామరస్యానికి మరింత బలాన్నివ్వాలని భట్టి విక్రమార్క అభిలషించారు.

