గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి
దసరా వివాదానికి చట్టప్రకారం పరిష్కారం చూపాలి
రాంపురం సర్పంచ్ రడం భరత్ వినతి
కాకతీయ, గీసుగొండ: రాంపురం గ్రామంలో దసరా పండుగ నిర్వహణపై నెలకొన్న వివాదాన్ని చట్టప్రకారం పరిష్కరించి, శాంతిభద్రతలు కాపాడాలని సర్పంచ్ రడం భరత్ ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్, గీసుగొండ సీఐ, తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. గతంలో గీసుగొండ గ్రామ పంచాయతీలో ఉపగ్రామంగా ఉన్న రాంపురం 2018లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిందని తెలిపారు. ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పటి నుంచి గీసుగొండకు చెందిన వీరగోని వంశస్థులు రాంపురంలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటయ్యాక గ్రామస్థులే వేడుకలు నిర్వహించుకోవాలని నిర్ణయించడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తినట్లు వివరించారు. గ్రామసభలోనూ ఈ మేరకు తీర్మానం చేసినట్లు తెలిపారు. పండుగ సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని భరత్ విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు ప్రశాంతంగా దసరా జరుపుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

