మోహన్ గ్రానైట్ క్వారీ మూసివేతకు ఆదేశాలు!
లీజు గడువు ముగిసినా కొనసాగుతున్న తవ్వకాలు
తండావాసుల ఫిర్యాదుతో స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి
మైనింగ్ శాఖకు సమాచారం.. త్వరలోనే క్వారీ మూసివేత?
కాకతీయ, ఇనుగుర్తి: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మోహన్ గ్రానైట్ క్వారీ మూసివేతకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం రెవెన్యూ పరిధిలోని మీట్యా తండా వద్ద సర్వే నంబర్లు 152, 152లో ఈ క్వారీ నిర్వహిస్తున్నారు. లీజు గడువు ముగిసినా తవ్వకాలు కొనసాగుతున్నాయని, అనుమతులకు విరుద్ధంగా లోతుగా తవ్వకాలు చేపడుతున్నారని తండావాసులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు క్వారీ మూసివేతకు ఉత్తర్వులు జారీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని మైనింగ్ శాఖకు కూడా తెలియజేసినట్లు పేర్కొన్నారు. అయితే ఉత్తర్వుల అమలు, క్వారీ మూసివేతపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

