ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం
ఖైరతాబాద్ బరిలో తెలంగాణ రక్షణ సేన
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
ఫామ్‌హౌస్ పేరుతో రాజకీయ హైడ్రామా ఆపాలి
తెర ముందు విమర్శలు.. తెర వెనుక లాలూచీనా?
ప్రజా సమస్యలపై పాలకులు సమాధానం చెప్పాలి
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాకతీయ,తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ ఉపఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్షంగా బరిలో నిలుస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ ఫామ్‌హౌస్ పేరిట సరికొత్త రాజకీయ హైడ్రామాకు తెరలేపుతున్నారని విమర్శించారు. పాలకులు గంటకో మాట.. పూటకో బాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇది మాటలకే పరిమితమైన ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో ఉపఎన్నికకు మార్గం సుగమమైంది. ప్రధాన పార్టీల నేతలు తెరముందు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ, తెరవెనుక లోపాయికారీ ఒప్పందాలు కొనసాగుతున్నాయని కవిత ఆరోపించారు. ఫామ్‌హౌస్‌ల అంశంపై కాలయాపన తప్ప పాలకుల నుంచి కఠిన చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి రాజకీయ అంశాలతో కాలం గడపడం సరికాదని కవిత అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రజా సమస్యలపై స్పష్టమైన సమాధానాలు రాబట్టేందుకు తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో తెలంగాణ రక్షణ సేన పోటీ చేయనున్నట్లు కవిత చేసిన ప్రకటనతో ఆ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ప్రజల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకెళ్తామని ఆమె ప్రకటించారు.

