epaper
Wednesday, September 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రేవంత్‌ సర్కార్‌కు అనస్థీషియా తప్పదు

రేవంత్‌ సర్కార్‌కు అనస్థీషియా తప్పదు
కాంగ్రెస్ హామీలన్నీ మోసాలేనని ప్రజలు గుర్తించారు
నా పనితీరే నా రాజకీయ ఎదుగుదలకు కారణం
భూపాలపల్లే నాకుటుంబం..మళ్లీ పాదయాత్రతో ప్రజల్లోకి
నా రాజ‌కీయ ప్ర‌యాణంలో అనేక కుట్ర‌లు ఎదుర్కొన్నా
రెండు సార్లు మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారింది
ప్ర‌జ‌ల‌తో నేరుగా స‌త్సంబంధాలే నా రాజ‌కీయ బ‌లమ‌ని న‌మ్ముతా
నా కొడుకు గౌతమ్‌ రాజకీయాల్లోకి వ‌స్తానంటే స్వాగ‌తిస్తా
డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌ చిట్‌చాట్‌లో భూపాల‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. రైతు భరోసా, రైతు బీమా, పెన్షన్లు, మహిళలకు రూ.2,500 హామీ, యూరియా సమస్యలపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పాదయాత్ర చేపట్టి ప్రజలను నేరుగా కలుస్తానని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎదురైన పరిణామాలు, పదవులు చేజారిన సందర్భాలు, భూపాలపల్లి అభివృద్ధి, బీఆర్‌ఎస్‌లో చేరిక, కుటుంబం, భవిష్యత్‌ రాజకీయ అడుగులపై తెలంగాణ డిజిటల్‌ మీడియా యూనియన్‌ ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

హామీలన్నీ మోసాలేనని ప్రజలు గుర్తించారు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల పరిస్థితి ఏమిటన్నది ప్రజలే చూస్తున్నారు. రైతులు తమ పరిస్థితి ఎలా ఉందో చెప్పగలరు. రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల విషయంలో ప్రజల్లో చర్చ జరుగుతోంది. పెన్షన్ల విషయంలోనూ సమస్యలు ఉన్నాయి. మహిళలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ పరిస్థితి ఏమిటన్నది మహిళలే చెబుతున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలా అన్ని వర్గాల్లో సమస్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఎవరేం చెప్పారు.. అధికారంలోకి వచ్చాక ఏం చేశారు.. అన్న విషయాలను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఈ హామీలు మోసాలేనని ప్రజలు గుర్తిస్తున్నారని నేను భావిస్తున్నాను. ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. ఇక రేవంత్‌ సర్కార్‌ను అనస్థీషియా ఇచ్చి మళ్లీ పడుకోబెట్టే కాలం దగ్గర్లోనే ఉంది.

మళ్లీ పాదయాత్ర చేస్తా

నా రాజకీయ ప్రస్థానంలో భూపాలపల్లికి ప్రత్యేక స్థానం ఉంది. భూపాలపల్లి నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఆ ప్రాంతంతో నా అనుబంధం కేవలం రాజకీయానికి పరిమితం కాదు. నా కుటుంబంతో, నా జీవిత ప్రయాణంతో భూపాలపల్లి ముడిపడి ఉంది. అక్కడి ప్రజల సమస్యలు నాకు తెలుసు. భూపాలపల్లి మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు, వలస వచ్చిన ప్రజలు అక్కడ ఉన్నారు. అందరి అవసరాలు, సమస్యలు ఒకేలా ఉండవు. అందుకే ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో నియోజకవర్గమంతా పాదయాత్ర చేస్తాను. గ్రామగ్రామాన తిరుగుతాను. ప్రజలను కలుస్తాను. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమిటి.. వాటిలో ఏవి అమలయ్యాయి.. ఏ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.. నా హయాంలో ఏం చేశాను.. అనే విషయాలను ప్రజల ముందుంచుతాను. రాజకీయాల్లో ప్రజలతో నిరంతర సంబంధమే అసలైన బలం. ప్రజలకు దూరంగా ఉండి రాజకీయాలు చేయలేం. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు వినడం, వాటిపై స్పందించడం, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడాన్నే నేను నా రాజకీయ బలంగా భావిస్తాను.

భూపాలపల్లి అభివృద్ధే నా లక్ష్యం

నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు భూపాలపల్లి ఎన్నో సమస్యలతో ఉండేది. అప్పట్లో విద్య, వైద్య రంగాల్లో కూడా తగిన సదుపాయాలు లేవు. డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియట్‌ కళాశాలలు తీసుకొచ్చాం. మొదట అక్కడ పీహెచ్‌సీ మాత్రమే ఉండేది. ఇప్పుడు వైద్య కళాశాల, వంద పడకల ఆసుపత్రి ఉన్నాయి. సింగరేణి కార్మికుల కోసం రెండు వేల క్వార్టర్ల నిర్మాణం జరిగింది. చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతల పథకాలు, రహదారుల విస్తరణ వంటి అనేక పనులు జరిగాయి. బైపాస్‌ రహదారికి అనుమతి వచ్చినా అది ఇంకా పూర్తి కాలేదు. అన్ని సమస్యలను పరిష్కరించానని నేను చెప్పను. ఇంకా కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. కానీ అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావడంలో నేను ముందుండేవాడిని. అవసరమైన నిధుల కోసం అధికారులను, ప్రభుత్వ పెద్దలను కలిసేవాడిని. భూపాలపల్లికి ఏ పని అవసరమో గుర్తించి దాని కోసం పోరాడేవాడిని. ప్రజల అవసరాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించేందుకు ప్రయత్నించేవాడిని. అందుకే నా రాజకీయ ప్రయాణం మొత్తం భూపాలపల్లితో ముడిపడి ఉంది. నా కుటుంబం భూపాలపల్లే. అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. మరోసారి అవకాశం వస్తే భూపాలపల్లిని రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టేందుకు కృషి చేస్తాను.

నా పనితీరే నా రాజకీయ ఎదుగుదలకు కారణం

నాకు రాజకీయ నేపథ్యం లేదు. నా ఎదుగుదల వెనుక కుటుంబ రాజకీయ వారసత్వం లేదు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొంటూ రాజకీయాల్లోకి వచ్చాను. పాలిటెక్నిక్‌లో చదువుతున్న సమయంలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాల కారణంగా పాలిటెక్నిక్‌ విద్యార్థులకు బీటెక్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలు వచ్చేలా పోరాటం చేశాం. ఆ పోరాటంలో నేను ఒక విద్యా సంవత్సరం కోల్పోయాను. ఉద్యమాలు ఎక్కువ కావడంతో కాలేజీ మార్చాల్సి వచ్చింది. అదే కాలేజీలో పీజేఆర్‌ కూడా చదివారు. అప్పటి ప్రిన్సిపాల్‌ నాతో ‘పీజేఆర్‌ నాయకుడయ్యారు.. నువ్వూ నాయకుడవుతావు’ అని చెప్పేవారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన సమయంలో బస్సుల టైర్లు గాలి తీసిన ఉద్యమంలోనూ పాల్గొన్నాను. అప్పట్లో నా తీరు చాలా దూకుడుగా ఉండేది. హయగ్రీవాచారి ఒకసారి నా ప్రవర్తనను మందలించారు. కానీ ఆ పోరాట స్వభావమే తర్వాత నా రాజకీయ జీవితానికి పునాదిగా మారింది. రాజకీయాల్లో ఎదగడానికి ఎలాంటి రాజకీయ వారసత్వం నాకు లేదు. నా పనితీరే నా ఎదుగుదలకు కారణం. రాజకీయాల్లో కుట్రలు సహజం. తడిగుడ్డతో గొంతు కోస్తారు. నవ్వుతూనే ప్రాణం తీస్తారు. నన్ను రాజకీయంగా అణగదొక్కేందుకు, అవకాశాలు రాకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయినా నేను వెనక్కి తగ్గలేదు.

పదమూడేళ్లు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశా

1989 నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగుతున్నాను. జిల్లా స్థాయిలో యువజన కాంగ్రెస్‌లో పనిచేశాను. ఆ సమయంలో నక్సలైట్‌ ప్రభావం ఎక్కువగా ఉండేది. మా ఇల్లు రోడ్డుపక్కనే ఉండేది. రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్న సమయంలో నన్ను తీసుకెళ్లారు. మా ఇంటిని పేల్చేశారు. మొదట మా నాన్న రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకించారు. కానీ నా పట్టుదల, పోరాటం చూసి తర్వాత నాకు మద్దతుగా నిలిచారు. 1999లో అసెంబ్లీ టికెట్‌ కోసం ప్రయత్నించాను. టికెట్‌ రాలేదు. 2001లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. పదమూడేళ్లు ఆ పదవిలో కొనసాగాను. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నిరంతరం పనిచేశాను. అప్పట్లో సామాజిక మాధ్యమాలు లేవు. టీవీలు, పత్రికలే ప్రధాన ప్రచార వేదికలు. ప్రతిరోజూ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాను. 2004లో పార్టీ అధికారంలోకి రావడంలో నా వంతు కృషి చేశాను. 2014 వరకు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాను. నన్నెవరూ పదవి నుంచి తొలగించలేదు. నేనే తప్పుకున్నాను. పార్టీ కోసం పనిచేస్తే పదవులు వస్తాయా రావా అనేది తర్వాతి విషయం. ముందుగా పార్టీ కోసం మనం ఎంత పని చేశామన్నదే ముఖ్యం అని నేను నమ్ముతాను.

రెండు సార్లు మంత్రి పదవి చేజారింది

2004లో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్‌ ఆఫర్‌ వచ్చింది. కానీ నా రాజకీయ జీవితమంతా ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాను. కేవలం టికెట్‌ కోసం ఆ పార్టీలో చేరడం నాకు సరికాదనిపించింది. అయితే ఎన్టీఆర్‌ అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది. నటుడిగా ఆయనను ఎంతో ఇష్టపడేవాడిని. పరిపాలనలో ఆయన తీసుకొచ్చిన మార్పులను కూడా మా తరం చూసింది. నేను రెండుసార్లు కరువు పరిస్థితులను చూశాను. 2007లో ఎమ్మెల్సీగా గెలవడం మరో కీలక మలుపు. వైఎస్‌ నన్ను హనుమకొండ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని భావించారు. తర్వాత వరంగల్‌ ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా వచ్చింది. టికెట్‌ విషయంలో నా పేరు ముందుకు వచ్చింది. కానీ రాజకీయ పరిణామాలతో రెండు ఎంపీ టికెట్లు అప్పటి తెరాసకు కేటాయించారు. ఆ తర్వాత అసెంబ్లీ, ఎమ్మెల్సీ స్థానాల విషయంలోనూ అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశాను. కాంగ్రెస్‌ బలం తక్కువగా ఉండటంతో నేను ఓడిపోతానని చాలామంది అనుకున్నారు. కానీ కేసీఆర్‌ మాట ప్రకారం తెరాస పూర్తిగా మద్దతు ఇచ్చింది. నేను 115 ఓట్ల మెజారిటీతో గెలిచాను. 2011లో మంత్రిపదవి వస్తుందని చివరి వరకు అనుకున్నాను. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘మీ పేరు వచ్చింది.. అయిపోయింది’ అని చెప్పారు. మరుసటి రోజు గవర్నర్‌ ప్రమాణస్వీకారం ఉంటుందని భావించాం. కానీ ఉదయం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. చివరకు ప్రమాణస్వీకారం జరిగింది. నా పేరు ఎందుకు మిస్‌ అయిందని రోశయ్య కూడా అడిగారు. మరోసారి మంత్రివర్గ విస్తరణలోనూ అవకాశం వచ్చింది అనుకున్నా చివరి నిమిషంలో చేజారింది. స్థానిక రాజకీయ కుట్రలు కూడా అందులో భాగమయ్యాయి. అయినా 2012లో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా బాధ్యతలు చేపట్టాను. నా రాజకీయ ఎదుగుదలను ఎవరూ పూర్తిగా ఆపలేరు. అవకాశాలు ఆలస్యమవుతాయి.. కానీ పోరాటం ఆపకూడదు.

కేసీఆర్‌, కేటీఆర్‌తో అనుబంధం

2019లో పరిస్థితుల కారణంగా బీఆర్‌ఎస్‌లో చేరాను. ఉద్యమ కాలం నుంచే కేటీఆర్‌తో నాకు పరిచయం ఉంది. కేసీఆర్‌తో కూడా మంచి సంబంధం ఉంది. కేసీఆర్‌ పనిచేసే విధానం ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది. ఆయనను కలవడం కష్టమని చాలామంది అంటారు. కానీ ఒకసారి కలిసిన తర్వాత సమస్యను పరిష్కరించడంలో ఆయన వేగం వేరుగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను క్లియర్‌ చేయించగలుగుతారు. ఒక్కోసారి అరగంట, గంట మాట్లాడతారు. మరికొన్ని సందర్భాల్లో రోజంతా లేదా రోజులో చాలా సమయం చర్చిస్తారు. ఏ అంశంపైనైనా లోతైన అవగాహనతో మాట్లాడగలరు. ఉద్యమ కాలం నుంచే ఆయనతో నాకు పరిచయం ఉంది. అందుకే ఆయన రాజకీయ వ్యవహార శైలిని దగ్గరగా చూశాను. రాజకీయాల్లో పరిస్థితులు మారుతుంటాయి. కానీ ప్రజలతో సంబంధం, పార్టీ కోసం పనిచేసిన అనుభవం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్నదానికంటే, ప్రజలతో మన అనుబంధం ఎలా ఉందన్నదే చివరికి ముఖ్యమని నేను భావిస్తాను.

రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యం ఎక్కువైంది..!

మా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం కాదు. చిన్నతనంలో పెద్దగా ఆర్థిక సమస్యలు ఎదుర్కోలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు ప్రాధాన్యం ఏమిటో అర్థమైంది. రాజకీయ ప్రయాణంలో డబ్బు కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారింది. అందుకే వ్యాపార రంగంలోకి కూడా వెళ్లాను. చిన్నప్పటి నుంచే వ్యవసాయంపై నాకు మంచి ఆసక్తి. ఇప్పటికీ సమయం దొరికితే పొలానికి వెళ్తాను. వ్యవసాయ పనులు నాకు తెలుసు. ఒకప్పుడు మా పొలాల్లో పనిచేసే కూలీలు పంటకాలంలో వేతనం లేకుండా కూడా సహాయం చేసేవారు. వాళ్లు ఆహారం అడిగితే జొన్నలు ఇచ్చేవాళ్లం. అప్పటి సామాజిక సంబంధాలు వేరు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నా భార్య గండ్ర జ్యోతి నా రాజకీయ జీవితంలో నాకు పూర్తి అండగా నిలిచారు. 2005లో రిజర్వేషన్‌ కారణంగా ఆమెను వరంగల్‌ మేయర్‌గా చేయాలని ప్రయత్నించాను. వైఎస్‌తో మాట్లాడి ఆ దిశగా ముందుకు వెళ్లాను. కానీ రాజకీయ పరిణామాలతో ఆ అవకాశం కూడా చేజారింది. రాజకీయాల్లో పైకి వస్తున్న వారిని ఆపేందుకు నిశ్శబ్దంగా జరిగే కుట్రలు ఉంటాయి. గండ్ర జ్యోతి ఇప్పటికే వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మహిళా రిజర్వేషన్లు వస్తే ఆమె అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా కుమారుడు గౌతమ్‌ రాజకీయాల్లోకి రావాలా వ‌ద్దా అన్న‌ది అత‌ని నిర్ణ‌య‌మే. వ‌స్తే స్వాగ‌తిస్తాను. ఎప్పుడు వచ్చినా నేను వద్దనను. రాబోయే రోజుల్లో అతను కేటీఆర్‌ బృందంలో ఉంటాడ‌ని అనుకుంటున్నా. నా రాజకీయ ప్రస్థానం పోరాటాలతోనే సాగింది.ఇక‌పైన కూడా అదే పంథాలోనే ముందుకు సాగుతా. భవిష్యత్తులోనూ ప్రజల మధ్యే ఉంటాను. భూపాలపల్లి అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా వంతు రాజకీయ పోరాటం కొనసాగిస్తాను.

-ఉత్త‌రం కాక‌తీయ ఎడిట‌ర్‌
అరెల్లి కిర‌ణ్ గౌడ్‌
-7396604266

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్యంగా ముందుకు సాగుదాం

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్యంగా ముందుకు సాగుదాం కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా...

టీయూడబ్ల్యూజే మండల కమిటీ ఎన్నిక

టీయూడబ్ల్యూజే మండల కమిటీ ఎన్నిక కాకతీయ, నెల్లికుదురు : టీయూడబ్ల్యూజే-143 నెల్లికుదురు మండల...

లెంకపల్లి సర్పంచ్‌ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన హరీశ్‌రావు

లెంకపల్లి సర్పంచ్‌ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన హరీశ్‌రావు కాకతీయ, నర్సంపేట: ఇటీవల రోడ్డు...

ప్రశ్నపత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ప్రశ్నపత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కాకతీయ, నెల్లికుదురు: ప్రశ్నపత్రాల బాహ్య...

సీజనల్‌ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

సీజనల్‌ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి పట్టుదలతో...

వాగ్దేవి స్కూల్లో సైన్స్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌

వాగ్దేవి స్కూల్లో సైన్స్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రంలోని...

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి పెండింగ్‌ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి మాజీ...

ప్రమాదాల నివారణే లక్ష్యం

ప్రమాదాల నివారణే లక్ష్యం వర్ధన్నపేట,రాయపర్తిలో రోడ్డు ప్రమాద స్థలాల పరిశీలన వరంగల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.