బల్దియా గ్రీవెన్స్‌కు 81 ఫిర్యాదులు
టౌన్ప్లానింగ్దే టాప్. ఇంజినీరింగ్ విభాగంపై 28 ఫిర్యాదులు
నెలలుగా పరిష్కారం లేదంటున్న బాధితులు
ప్రజావాణిలో వెల్లువెత్తిన నగర సమస్యలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి (బల్దియా గ్రీవెన్స్) కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో టౌన్‌ప్లానింగ్‌కు 32, ఇంజినీరింగ్‌కు 28, ఆరోగ్యం, పారిశుద్ధ్యానికి 9, రెవెన్యూకు 9, నీటి సరఫరాకు 3 దరఖాస్తులు అందాయి. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలపైనే అత్యధిక ఫిర్యాదులు రావడం గమనార్హం. పైడిపల్లి లక్ష్మీ గణపతి కాలనీలో రూ.47 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు పనులు ఏడాదిన్నరగా ప్రారంభం కాలేదని 3వ డివిజన్ వాసులు ఫిర్యాదు చేశారు. సుబేదారిలో ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.24,398 చెల్లించినా, సంబంధం లేని సర్వే నంబర్‌పై ఉన్న కోర్టు కేసును చూపి దరఖాస్తును నిలిపివేశారని ఎన్. నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. 36వ డివిజన్లో 2022 నుంచి అండర్‌డ్రైనేజీ పొంగుతోందని ఎస్. రఘు వాపోయారు. మట్టెవాడ గోపాలస్వామి గుడి తోట మైదానంలో వాకర్స్ కోసం ఓపెన్ జిమ్, పిల్లలకు ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని వాకర్స్ అసోసియేషన్ కోరింది. బతుకమ్మ వేడుకలకు క్లీనింగ్, లైటింగ్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఓ సిటీ వాసులు విజ్ఞప్తి చేశారు. ముత్తకొండ కాలనీలో రెండు నెలలుగా నీళ్లు రావడం లేదని సిరిమళ్ల వెంకటయ్య, చింతగట్టు బస్టాండ్ నుంచి రైస్‌మిల్లు వరకు రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న తీగలతో ప్రమాదాలు జరుగుతున్నాయని 65వ డివిజన్ వాసులు ఫిర్యాదు చేశారు.

