ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా
రూ.1.32 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి భరోసా
కాకతీయ, రాయపర్తి/పాలకుర్తి: పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన 132 మంది లబ్ధిదారులకు రూ.1,32,13,992 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని, పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందువరుసలో నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

