పెళ్లి చేసుకునే వరకు ఇక్కడే ఉంటా!
ప్రియుడి ఇంటి ముందు టెంట్ వేసి యువతి మౌన పోరాటం
మూడేళ్లు ప్రేమించి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆరోపణ
వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ ఇంటి ముందు ఉద్రిక్తత..
కాకతీయ, రాయపర్తి/వర్ధన్నపేట : ప్రియుడు వచ్చి తనను పెళ్లి చేసుకునే వరకు ఇంటి ముందు నుంచి కదిలేది లేదంటూ ఓ యువతి టెంట్ వేసి మౌన పోరాటానికి దిగింది. వర్ధన్నపేటలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. బాధితురాలు తుమ్మల శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ 3 ఏళ్లుగా తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా లొంగదీసుకున్నాడని ఆరోపించింది. ఇటీవల పెళ్లి విషయమై నిలదీయగా నిరాకరిస్తూ మొహం చాటేశాడని, పెద్దలను ఆశ్రయించినా సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. రాజకీయ అధికార బలంతో తనను, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. శ్రీకాంత్ వచ్చి పెళ్లి చేసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది. న్యాయం జరగకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

