జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
కేంద్రం గుప్పిట్లోకి ఎన్నికల సంఘం
ఓటు హక్కును కాపాడేందుకు ఉమ్మడిగా ఉద్యమిస్తాం
సీఈసీ పదవికి జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతల ధ్వజం
అంబేద్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర
హన్మకొండ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన
జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, హన్మకొండ : స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని, దేశంలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు జరగాలంటే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ పదవికి రాజీనామా చేయాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టి జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఇండియా కూటమి నేతలు విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసేలా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉన్నప్పటికీ.. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు, రాజకీయ పక్షాలు కలసి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

అంబేద్కర్ సెంటర్ నుంచి పాదయాత్ర
అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కలెక్టరేట్ వరకు కొనసాగింది. కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేతుల్లో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఎన్నికల వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ చేరుకున్న అనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించి, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఇతర నాయకులు అన్నారు. దేశంలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉండాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పనితీరుపై తమ నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కలెక్టరేట్ ఎదుట ఆందోళన
డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ పాల్గొన్నారు. టీఎస్ మేరా కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి జి. ప్రభాకర్ రెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు, టీజేఎస్ అధ్యక్షుడు చిల్లా రాజేంద్ర ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జి దుద్దిల్ల శ్రీను బాబు, కుడా చైర్మన్ గుండు సుధారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్లు పులి ప్రియాంక, చందుపట్ల రాజీ రెడ్డి, టీపీసీసీ సభ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి. శ్రీనివాస్ రావు, బత్తిని శ్రీనివాస్, కూచన రవళి, ఐవైసీ జాతీయ కో-ఆర్డినేటర్ గొట్టిముక్కల సాగరిక రావు, ఐఎన్‌టీయూసీ నాయకుడు కూర వెంకట్, మారంరెడ్డి కౌటిల్ రెడ్డి, వివిధ సెల్‌ల అధ్యక్షులు, మండల, డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఆర్‌జీపీఆర్‌ఎస్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

