కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు
ఏనుమాములలో టాస్క్ ఫోర్స్ దాడి
అపరిశుభ్ర వాతావరణంలో తయారీ
రూ.13,605 విలువైన సరుకు స్వాధీనం, ఒకరి అరెస్ట్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఏనుమాముల పీఎస్ పరిధిలోని ఆరేపల్లిలోని హెచ్ కె జి ఎన్ ఇండస్ట్రీస్ లో ఈ దాడి నిర్వహించారు.
పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ టీం దాడి చేయగా, ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో అల్లం..వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నాసిరకం ముడి సరుకులు, అల్లం పొడిని పేస్ట్ లో కలుపుతూ వివిధ బ్రాండ్ల పేర్లతో ప్యాకింగ్ చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.
స్వాధీనం చేసుకున్న సరుకు వివరాలు
టాస్క్ ఫోర్స్ అధికారులు మొత్తం రూ. 13,605 విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. అందులో 60 కిలోల లూజ్ పేస్ట్, 500 గ్రాములు, 1 కిలో బాక్సులు, ఎక్స్ పైరీ అయిన రీఫిల్లింగ్ ఐటెమ్స్, ఫుడ్ కలర్, సిట్రిక్ యాసిడ్ తదితరాలు ఉన్నాయి.
నిందితుడు ఆరేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం పాషాగా గుర్తించి, సరుకుతో సహా తదుపరి చర్యల నిమిత్తం వరంగల్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.
ఈ దాడిలో ఏసీపీ ఎ మధుసూదన్, ఇన్ స్పెక్టర్ బి. రాజగోపాల్, ఎస్ఐ కె. శ్యాంసుందర్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

