ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష
కాకతీయ,చిగురుమామిడి : హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు చేపట్టిన నాలుగు వరుసల (ఫోర్ వే) రోడ్డు విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ చిగురుమామిడి మండల కేంద్రంలో నివాస గృహాల బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారంతో ఏడవ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా బాధితులు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పని చేస్తామని చెబుతూనే, మమ్మల్ని నడిరోడ్డు మీద నిలబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిగురుమామిడిలో రోడ్డు విస్తరణ పేరుతో 311 ఇళ్లను కోల్పోతున్నామని, అందులో 85 ఇళ్లు పూర్తిగా, 210 ఇళ్లు పాక్షికంగా దెబ్బతింటున్నాయని, రోడ్డుకు ఇరువైపులా ఉన్నది పూర్తిగా నిరుపేదలేనని తెలిపారు.
ఇది జాతీయ రహదారి కాదని, కేవలం రాష్ట్ర రహదారి మాత్రమేనని, కాబట్టి నష్టం జరిగే చోట నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. లేదా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బాధితుల పక్షాన ఆలోచించాలని, లేనిపక్షంలో 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రజల క్షేమం కోసం రహదారి ప్రణాళికను మార్చుకోవచ్చని, ప్రభుత్వం తమ విన్నపాన్ని పరిగణలోకి తీసుకోవాలని, లేకుంటే రానున్న కాలంలో పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బాధితులు హెచ్చరించారు. ఈ రిలే నిరాహార దీక్షలో కాటం నరసయ్య, తెరాల సత్యనారాయణ, గూడెం లక్ష్మి, కోనేటి వెంకటేశం, పతంగి బాలరాజు, సూరం ప్రతాప్ రెడ్డి, చిట్టుమల్ల చిన్న రవీందర్, సింగాపురం బాలరాజు, దాసరి వేణు, గుగ్గిళ్ళ వేణు, బుర్ర కనకయ్య, చిట్టి మల్ల లక్ష్మి, ఫోటు రాజవ్వ తదితరులు పాల్గొన్నారు,

