4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్ డ్రైవ్ కేసులు
42 వాహనాలు సీజ్.. రూ.1.16 లక్షల జరిమానాల వసూలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బుధవారం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు విస్తృత నాకాబందీ నిర్వహించారు. టౌన్, రూరల్, హుజూరాబాద్ డివిజన్లలో ప్రధాన కూడళ్లు, జాతీయ, అంతర్గత రహదారులపై మొత్తం 4,265 వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 115 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 వాహనాలను సీజ్ చేశారు. 133 స్పాట్ చలాన్ల ద్వారా రూ.66,135, 126 పెండింగ్ చలాన్ల ద్వారా రూ.50,300 వసూలు చేశారు. 21 ఈ-చలాన్లు, 12 ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. 81 మంది అనుమానితులను వేలిముద్రల ఆధారంగా తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. వాహన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవడంతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ఆకస్మిక నాకాబందీ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

