కరెంట్ కోతలతో కరిగిపోతున్న రైతు ఆశలు
* ఎండిపోతున్న వరి పంటలు.. ఆందోళనలో అన్నదాతలు
* వ్యవసాయానికి కనీసం 15 గంటల నిరంతర విద్యుత్ అందించాలని రైతుల డిమాండ్
కాకతీయ,చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో విద్యుత్ కోతల కారణంగా వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు అత్యంత కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలకు అవసరమైన నీటిని అందించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు, విద్యుత్ కోతల కారణంగా పంటలు దెబ్బతింటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన రైతు కంతుల నర్సయ్య మాట్లాడుతూ.. వరి పంటకు ప్రస్తుతం నీటి అవసరం ఎక్కువగా ఉందని, అయితే వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో మోటార్లు నడిపి పంటలకు నీరు అందించడం కష్టంగా మారిందన్నారు.పంటలు ఎండిపోకుండా సకాలంలో నీరు అందించాల్సిన పరిస్థితిలో విద్యుత్ కోతలు కొనసాగడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ కొరత కారణంగా నష్టం వాటిల్లితే రైతుల కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.వ్యవసాయానికి కనీసం 15 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వెంటనే పరిష్కరించి, పంటలకు అవసరమైన సమయంలో నిరంతర విద్యుత్ అందించాలని కోరుతున్నారు.రైతుల ఇబ్బందులను ప్రభుత్వం, విద్యుత్ అధికారులు వెంటనే గుర్తించి వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకుని అన్నదాతలకు అండగా నిలవాలని కోరుతున్నారు

