ముగ్గురి కోసం అటవీశాఖ గాలింపు
విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు గుర్తింపు
పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు
అధికారులకు చిక్కకుండా తప్పించుకున్న వైనం
స్వచ్ఛందంగా లొంగిపోవాలని సూచన
కాకతీయ, ఏటూరునాగారం: ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో వన్యప్రాణుల వేటకు విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన ముగ్గురి కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. జీడివాగు పరిసర అటవీ ప్రాంతాల్లో విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు గుర్తించిన అధికారులు ఎద్దు లోకేష్, చింతకింద రమేష్, బెస్త స్వామి కోసం గాలిస్తున్నట్లు దక్షిణ అటవీ క్షేత్రాధికారి అబ్దుల్ రేహమాన్ తెలిపారు. అధికారులు గాలింపు చేపట్టేలోపే ముగ్గురూ తప్పించుకున్నారని వారి కదలికలపై నిఘా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని అబ్దుల్ రేహమాన్ స్పష్టం చేశారు. ముగ్గురూ అటవీశాఖ అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

