అంగన్వాడీ, పాఠశాల, పల్లె దవాఖానల్లో పీఓ ఆకస్మిక తనిఖీలు
కాకతీయ,ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ప్రభుత్వ విద్య, ఆరోగ్య సంస్థల్లో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆకులవారి ఘనపూర్ అంగన్వాడీ కేంద్రం, జీపీ పాఠశాలతో పాటు ఎటూరునాగారం సబ్ సెంటర్–1 (పల్లె దవాఖాన), సబ్ సెంటర్–2లను ఆయన సందర్శించి సేవల తీరును పరిశీలించారు.

అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ
ఆకులవారి ఘనపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన పీఓ చిన్నారుల హాజరు, రికార్డులు, అభ్యసన సామగ్రి, పోషకాహారం, కేంద్రం నిర్వహణను పరిశీలించారు. చిన్నారులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. బోధనా సామగ్రిని సమర్థవంతంగా వినియోగించి చిన్నారుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలని ఆదేశించారు.

విద్యార్థుల అభ్యసన స్థాయిపై ఆరా
ఆకులవారి ఘనపూర్ జీపీ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించిన పీఓ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వారి చదువు, అభ్యసన స్థాయి, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థుల నోట్‌బుక్స్, అభ్యసన సామగ్రిని పరిశీలించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పల్లె దవాఖానల్లో వైద్య సేవల పరిశీలన
ఏటూరునాగారం సబ్ సెంటర్–1 (పల్లె దవాఖాన), సబ్ సెంటర్–2లను తనిఖీ చేసిన పీఓ అక్కడ అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, మందుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, రోగుల వివరాల నమోదు, ఇతర రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందుతున్న సేవలు, అవసరమైన మందుల లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలు, ఓపీ సేవలు, రికార్డుల నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు సమయానుకూలంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

నాణ్యమైన సేవలందించడమే లక్ష్యం
ప్రభుత్వ విద్య, ఆరోగ్య సంస్థల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పీఓ లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి చిన్నారులు, విద్యార్థులు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


