రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
విద్యుత్ కోతలను నిరసిస్తూ తిమ్మాపురం సబ్‌స్టేషన్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా
పోలీసుల అడ్డగింత
పలువురు నాయకుల అరెస్ట్
కాకతీయ,నర్సంపేట టౌన్:-రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం నరసయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మం హైవేపై ఉన్న తిమ్మాపురం సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.
కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతిరెడ్డి నేతృత్వంలో, వరంగల్ జిల్లా అధ్యక్షుడు దండు కిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో పలువురు బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం నరసయ్య, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్ తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరెంటు కోతలతో పంటలకు నష్టం
గతంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందేదని, ప్రస్తుతం సరైన సమయంలో విద్యుత్ సరఫరా లేక వరి, పత్తి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని నాయకులు ఆరోపించారు. కరెంటు కోతల కారణంగా రైతులు రాత్రివేళల్లో పొలాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. పాములు, తేళ్ల భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలు, విద్యుత్ కోతలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు.
పోలీసుల అడ్డగింత
సబ్‌స్టేషన్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ టి. రాజేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పడమట జగన్మోహన్రెడ్డి, దేవర శీను, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతనకంటి శ్రీనివాస్‌రెడ్డి, గంగారెడ్డి, యాదగిరిరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, జలగం రంజిత్‌రావు, సిద్ధం నరేష్, ముత్తిరెడ్డి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

