ఓపెన్ కాస్టుతో రామప్పకు ముప్పు తప్పదు
సరస్సు నీరు భూగర్భంలోకి లీకయ్యే ప్రమాదం
ఇప్పటికే భూమి లోపల చీలికలు ఏర్పడ్డాయి
ఓపెన్ కాస్టుల బ్లాస్టింగులతో అవి రీయాక్టివేట్ అయ్యే అవకాశం
రామప్ప సరస్సు కట్ట తెగే ప్రమాదం ఎక్కువగా ఉంది
పేలుళ్ల ప్రకంపనల ప్రభావం దీర్ఘకాలంలో కనిపించొచ్చు
గతంలో నిర్వహించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలోనూ ఉంది
చెరువు కట్ట తెగేతే రామప్ప ఆలయ పరిసరాలు పూర్తి ధ్వంసమవుతాయి
ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లేందుకు ఆస్కారం ఉంది
సింగరేణి ఓపెన్ కాస్టు ప్రారంభించే విషయంలో తొందరపాటు పనికిరాదు
ఓపెన్ కాస్టు ప్రారంభిస్తే రామప్పకు యూనెస్కో గుర్తింపు కూడా పోతుంది
కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాం
కాకతీయ సాంస్కృతిక, కళా సంపద పరిరక్షణపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి
తెలంగాణ డిజిటల్ మీడియాతో ప్రొఫెసర్ ఎం. పాండు రంగారావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సింగరేణి ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ గనితో రామప్ప ఆలయం, సరస్సుకు ముప్పు తప్పదు. 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టాలని ప్రతిపాదించిన గని ప్రాంతం రామప్ప సరస్సు, ఆలయానికి దిగువ ప్రవాహ దిశలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ చేపట్టే తవ్వకాలు, బ్లాస్టింగులతో భూమి లోపల ఇప్పటికే ఉన్న చీలికలు మళ్లీ క్రియాశీలమవుతాయి. వాటి ద్వారా సరస్సు నీరు భూగర్భంలోకి లీకవుతుంది. నీటి ప్రవాహంలో మార్పులు, కట్ట కింద భూగర్భ పరిస్థితులపై ప్రభావం కారణంగా రామప్ప సరస్సు కట్ట తెగే ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. కట్ట తెగితే దిగువ ప్రాంతాల్లోని ఆస్తులు, పంటలు, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతోపాటు రామప్ప ఆలయ పరిసరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఓపెన్‌కాస్ట్ పేలుళ్ల ప్రకంపనలు ఆలయ నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. ఈ పరిణామాలు రామప్ప ఆలయ భద్రతతోపాటు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపుపైనా ప్రభావం చూపుతాయి. కాకతీయుల అపూర్వ సాంస్కృతిక, కళా సంపదను ప్రమాదంలోకి నెట్టే ఈ గని విషయంలో ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని
కాకతీయ హెరిటేజ్ ట్రస్టీ, ఇన్టాక్ (INTACH) వరంగల్ చాప్టర్ కన్వీనర్, వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు స్పష్టం చేశారు. తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ గని వల్ల తలెత్తే ప్రమాదాలను, వాటి వెనుక ఉన్న భౌగోళిక కారణాలను వివరించారు.

భూగర్భ చీలికలే ప్రధాన ముప్పు
ఇందుకోసం కర్ణాటకలోని సూరత్కల్ నిట్ వారు అధ్యయనం చేసి, ఓపెన్ కాస్ట్ మైన్‌తో రామప్ప ఆలయానికి పెద్దగా ప్రమాదం లేదని రిపోర్టు ఇచ్చిందని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. అలాగే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా ఎన్వోసీ తీసుకున్నామని అంటోంది. అంతేగాకుండా, భూగర్భాన్ని భూమి పొరలనూ సర్వే చేసేందుకు నెలకొల్పిన సంస్థ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( జీఎస్ఐ) నుంచి కూడా అనుమతి పొందినట్లు సింగరేణి యాజమాన్యం చెబుతోంది. అయితే రామప్ప ఆలయం, సరస్సు భద్రతను అంచనా వేసేటప్పుడు గని ప్రాంతానికి ఉన్న దూరాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవద్దు. భూమి లోపల ఉన్న రాతి పొరలు, వాటి అమరిక, భ్రంశాలు, చీలికలు, భూగర్భ జలాల ప్రవాహ మార్గాలే కీలకం. వెంకటాపురం వద్ద ప్రతిపాదించిన గని ప్రాంతం, రామప్ప సరస్సు మధ్య భూగర్భ సంబంధం ఉంది. ఈ ప్రాంతంలోని భౌగోళిక నిర్మాణాలను పరిశీలిస్తే రాతి పొరల్లో ప్రధాన, ఉప భ్రంశాలు, పగుళ్లు, జాయింట్లు విస్తరించి ఉన్నట్లు మా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు రూపొందించిన పటంలో చూపించాం. భూమిపై కనిపించని ఈ చీలికలు భూగర్భంలో నీటి ప్రవాహానికి మార్గాలుగా పనిచేస్తాయి. ఓపెన్‌కాస్ట్ తవ్వకాలు, బ్లాస్టింగుల వల్ల భూమి లోపలి సహజ నిర్మాణంపై ఒత్తిడి ఏర్పడుతుంది. దాంతో ఇప్పటికే ఉన్న చీలికలు మళ్లీ క్రియాశీలమవుతాయి. ఈ మార్పులు భూగర్భ జలాల కదలికపై ప్రభావం చూపుతాయి. గని ప్రాంతానికి, సరస్సుకు మధ్య ఉన్న భౌగోళిక అనుసంధానాన్ని విస్మరించడం వల్లే ప్రమాద తీవ్రతను తక్కువగా అంచనా వేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ గని ప్రభావాన్ని భూమిపై కనిపించే దూరంతో కాకుండా, భూగర్భ నిర్మాణం ఆధారంగా అర్థం చేసుకోవాలి.

సరస్సు నీరు లీకై కట్ట తెగే ప్రమాదం
ఈ ప్రాంతం ప్రాణహిత–గోదావరి గ్రాబెన్ బేసిన్లో భాగంగా ఉంది. ఇక్కడ పాఖాల్, సుల్లావాయి, దిగువ గోండ్వానా, ఎగువ గోండ్వానా శిలా నిర్మాణాలతోపాటు ఇసుకరాయి, షేల్, కంకర పొరలు, బొగ్గు నిల్వలున్న భౌగోళిక నిర్మాణాలు ఉన్నాయి. రాతి పొరల్లోని చీలికలు, భ్రంశాలు, జాయింట్లు భూగర్భ జలాల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. గని తవ్వకాలు 300 మీటర్ల లోతు వరకు సాగినప్పుడు అక్కడి భూగర్భ జలాల స్థాయి, నీటి పీడనంలో మార్పులు ఏర్పడతాయి. ఇప్పటికే ఉన్న చీలికలు మళ్లీ క్రియాశీలమవడంతో రామప్ప సరస్సు నీరు భూగర్భంలోకి లీకయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సరస్సులో నిల్వ ఉన్న నీరు భూగర్భ మార్గాల ద్వారా బయటకు వెళ్లడం వల్ల కట్ట కింద భూగర్భ పరిస్థితులు మారతాయి. రామప్ప సరస్సు కట్ట రెండు కొండలను అనుసంధానిస్తూ నిర్మించిన మట్టి కట్ట. మా ట్రస్టు నివేదికలో కట్టకు కట్ఆఫ్ ట్రెంచ్ లేదన్న అంశాన్ని ప్రస్తావించాం. కట్ఆఫ్ ట్రెంచ్ అనేది కట్ట కింద నీరు భూగర్భంలోకి ప్రవహించడాన్ని నియంత్రించే నిరోధక నిర్మాణం. ఈ నిర్మాణం లేకపోవడం, భూగర్భ చీలికల ద్వారా నీటి ప్రవాహం పెరగడం వంటి అంశాలు కట్ట భద్రతకు ముప్పుగా మారతాయి. సుమారు 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రామప్ప సరస్సు దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇంతటి జలవనరు కట్ట తెగితే దిగువ ప్రాంతాల్లోని ప్రజలు, పంటలు, ఆస్తులకు భారీ నష్టం వాటిల్లుతుంది. రామప్ప ఆలయ పరిసరాలు కూడా తీవ్ర విధ్వంసానికి గురవుతాయి. ఈ ప్రమాదాన్ని కేవలం సాంకేతిక అంశంగా చూడకుండా ప్రజల ప్రాణాలు, వ్యవసాయం, వారసత్వ సంపద భద్రతకు సంబంధించిన అంశంగా చూడాలి.

జియోలాజికల్ సర్వే నివేదికలోనూ కీలక అంశాలు
రామప్ప సరస్సు, ప్రతిపాదిత గని మధ్య భౌగోళిక సంబంధం, భూగర్భ జలాల ప్రవాహం, చీలికల ప్రభావం వంటి అంశాలను మేము కాకతీయ హెరిటేజ్ ట్రస్టు తరఫున ఇప్పటికే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం. 2023 జూన్ 30 తేదీతో ఉన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలోని అంశాలను మా అభ్యంతరాల్లో ప్రస్తావించాం. ఆ నివేదికలోని 21, 22 పేజీలకు సంబంధించిన వివరాలు రామప్ప సరస్సు నీటిమట్టం, భూగర్భ జలాల కదలిక, ప్రతిపాదిత గని తవ్వకాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమైనవి. భూగర్భ చీలికలు, రాతి పొరల నిర్మాణం, నీటి ప్రవాహ మార్గాలను విడివిడిగా కాకుండా పరస్పర సంబంధంతో పరిశీలించాలి. ఈ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో గని తవ్వకాలు చేపట్టడం వల్ల సరస్సు నీటి భద్రతపై ప్రభావం పడుతుంది. మా ట్రస్టు ఈ అంశాలను ఆధారాలతో వివరించింది. అయినప్పటికీ గని ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేటప్పుడు సరస్సు కట్ట భద్రత, భూగర్భ జలాల ప్రవాహం, ఆలయ నిర్మాణ స్థిరత్వం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. శాస్త్రీయ నివేదికల్లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా గని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడం సరికాదు. ఈ నివేదికలోని వివరాలను సంబంధిత శాఖలు సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని, రామప్ప ఆలయం, సరస్సు భద్రతకు సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాలి.
పేలుళ్ల ప్రకంపనలతో ఆలయ నిర్మాణానికి నష్టం
రామప్ప ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన సాండ్ బాక్స్ టెక్నాలజీ కాకతీయుల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. పునాది భాగంలో ఇసుకను నింపి, దాని మీద ఆలయ నిర్మాణ భారాన్ని మోయించే విధానాన్ని ఉపయోగించారు. అంటే ఇక్కడ పరిమిత ఇసుక మాత్రమే ఉంటుంది. భూగర్భ జలాల ప్రవాహం కారణంగా పునాదుల్లోని ఇసుక, మట్టి రేణువులు కొట్టుకుపోయి (పైపింగ్ ఫినామినా) అంతర్గత ఖాళీలు ఏర్పడుతాయి. దీనివల్ల రామప్ప దేవాలయ పునాదుల స్థిరత్వానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని జీఎస్ఐ తన నివేదికలో హెచ్చరించింది. రామప్ప చెరువు, దేవాలయం గుండా పరస్పరం అనుసంధానమై విస్తరించిన భౌగోళిక చీలికల వెంట నీరు ప్రవహించడం వల్ల రామప్ప ఆలయ పునాదిగా ఉన్న ఈ ఇసుక పెట్టె నిర్మాణం బలహీన పడుతుంది. రామప్ప దేవాలయంపై పేలుళ్ల ప్రభావం ప్రస్తుతం తక్కువగానే ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో పదేపదే సంభవించే ప్రకంపనలు దేవాలయంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. నిరంతర పేలుళ్లతో కాలక్రమేణా తీవ్ర నష్టం జరుగుతుంది. శతాబ్దాలుగా నిలిచి ఉన్న ఈ నిర్మాణం భూగర్భ పరిస్థితుల్లో వచ్చే మార్పులకు అతీతం కాదు. ఆలయంలోని రంగమండపంలో భారీ నేల దూలాలకు పగుళ్లు, నిర్మాణంలో అసమాన కూర్చివేత వంటి అంశాలను మా ట్రస్టు నివేదికలో ప్రస్తావించాం. భూకంపాలు, భూగర్భ జలాల హెచ్చుతగ్గులు, భౌగోళిక చీలికలు వంటి అంశాలు నిర్మాణంపై ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్‌కాస్ట్ గనిలో నిర్వహించే బ్లాస్టింగుల ప్రకంపనలు ఆలయ నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. పేలుళ్ల సమయంలో ఏర్పడే ప్రకంపనలు నేల ద్వారా వ్యాపించి పునాది, దూలాలు, రాతి నిర్మాణాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఒక్కసారి వచ్చే ప్రకంపనల ప్రభావం కంటే, పదేపదే జరిగే పేలుళ్ల వల్ల ఏర్పడే ప్రకంపనల ప్రభావం కాలక్రమంలో తీవ్రతరం అవుతుంది. ఇప్పటికే నిర్మాణపరమైన మార్పులు కనిపిస్తున్న పురాతన ఆలయానికి ఇలాంటి అదనపు ప్రభావం ప్రమాదకరం. అందుకే రామప్ప ఆలయాన్ని కాపాడాలంటే ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగులను అనుమతించకూడదు. ఈ ప్రమాదాన్ని కేవలం తక్షణ ప్రకంపనల స్థాయితో కొలవలేం. ఆలయ నిర్మాణం, పునాది స్థిరత్వం, చారిత్రక వారసత్వ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.
యునెస్కో గుర్తింపు, కాకతీయుల వారసత్వం ప్రమాదంలో
రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు సాధించడం వెనుక కాకతీయ హెరిటేజ్ ట్రస్టు, భారత పురావస్తు సర్వేక్షణ శాఖ, తెలంగాణ వారసత్వ శాఖ, జిల్లా యంత్రాంగం దశాబ్దానికి పైగా చేసిన కృషి ఉంది. 2021 జూలై 25న ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. కాకతీయుల నిర్మాణ కళ, శిల్ప సంపద, ఇంజినీరింగ్ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు ఇది. ఇప్పుడు ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఓపెన్‌కాస్ట్ తవ్వకాలు, బ్లాస్టింగుల వల్ల భూగర్భ చీలికలు క్రియాశీలమై, సరస్సు నీరు లీకై, కట్ట తెగే పరిస్థితి ఏర్పడితే ఆలయ పరిసరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. పేలుళ్ల ప్రకంపనలతో ఆలయ నిర్మాణానికి నష్టం కలిగితే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దాని పరిరక్షణపై కూడా తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి. రామప్పకు లభించిన యునెస్కో గుర్తింపు నిలవాలంటే ఆలయాన్ని మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న సహజ, భౌగోళిక పరిస్థితులు, సరస్సు భద్రతను కూడా కాపాడాలి. బొగ్గు ఉత్పత్తి అవసరాల కోసం శతాబ్దాల చరిత్ర కలిగిన వారసత్వ సంపదను ప్రమాదంలోకి నెట్టడం సమంజసం కాదు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గని ప్రతిపాదనను నిలిపివేయాలని నేను కోరుతున్నాను.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మా విజ్ఞప్తి
సింగరేణి వెంకటాపురం వద్ద ఓపెన్‌కాస్ట్ గని ప్రారంభించేందుకు పాలంపేట ప్రత్యేక అభివృద్ధి సంస్థ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం కోరినప్పటి నుంచే మేము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాం. 2023 మార్చి 1న ములుగు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశం, 2023 మార్చి 28న కలెక్టర్ నుంచి వచ్చిన లేఖ, అదే ఏడాది ఏప్రిల్ 1న మేము పంపిన లేఖ, 2024 డిసెంబరు 19న జరిగిన సమావేశం వంటి అంశాలను 2025 జనవరి 27న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి పంపిన లేఖలో వివరించాం. రామప్ప ఆలయం, సరస్సుకు గని వల్ల కలిగే ప్రమాదాలపై మా అభ్యంతరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం. 2026 అక్టోబరు 3న సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతికి కూడా లేఖ రాసి, గని ప్రతిపాదన ప్రభావాలను వివరించేందుకు వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఇవ్వాలని కోరాను. గని అనుమతుల ప్రస్తుత స్థితి, పాలంపేట ప్రత్యేక అభివృద్ధి సంస్థ నిరభ్యంతర ధ్రువపత్రం, పర్యావరణ అనుమతుల ప్రక్రియ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికపై తీసుకున్న చర్యల వివరాలను సింగరేణి యాజమాన్యం స్పష్టంగా వెల్లడించాలి. రామప్ప ఆలయం, సరస్సు భద్రతకు ముప్పు కలిగించే ఈ ప్రతిపాదనపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. కాకతీయుల సాంస్కృతిక, కళా సంపదను కాపాడటమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా ఉండాలి. రామప్ప ఆలయానికి, సరస్సుకు ముప్పు తెచ్చే ఓపెన్‌కాస్ట్ గని ప్రతిపాదనను పునఃపరిశీలించి, వారసత్వ సంపదను రక్షించే నిర్ణయం తీసుకోవాలని నేను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను.

