ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు
ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం
హామీలు అమలు చేయకపోతే మూల్యం తప్పదు
బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు
కాకతీయ, నర్సంపేట టౌన్ : ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ కూటమి ఓటమి పాలవడం రాష్ట్ర ప్రభుత్వానికి గొడ్డలిపెట్టులాంటిదని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు అన్నారు. ఈ ఫలితాలు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయని, మూడు డీఏలు చెల్లించాల్సి ఉండగా రెండే ఇస్తామనడం ఉద్యోగులను నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు. గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను అక్టోబర్ జీతంతో కలిపి చెల్లించకుండా, పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుపుతామనడం సమంజసం కాదన్నారు. ఇది ఉద్యోగులను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని యువరాజు ఆరోపించారు. ఆర్టీసీ ఎన్నికల ఫలితాలను ప్రభుత్వం హెచ్చరికగా భావించాలని సూచించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఓట్ల రూపంలో వ్యక్తమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని గోనే యువరాజు డిమాండ్ చేశారు.

