జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి
13 కోట్ల ఓటర్ల పేర్ల తొలగింపుపై సీఐటీయూ నిరసన
ఢిల్లీ ఆందోళనకారులకు మద్దతుగా హైదరాబాద్‌లో ధర్నా
కాకతీయ,హైదరాబాద్ : హైదరాబాద్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది పేర్ల తొలగింపునకు నైతిక బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో గత 2 రోజులుగా కొనసాగుతున్న నిరసనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పాలడుగు భాస్కర్ విమర్శించారు. 57 మెట్రో స్టేషన్లతో పాటు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లను మూసివేయడం, ఉత్తర భారతదేశంలోని పలు రైళ్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, నిరసనకారులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని భాస్కర్ అన్నారు. శాంతియుత నిరసనలను నిర్బంధాలతో అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు.
దేశవ్యాప్త పోరాటానికి పిలుపు
జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేసేంతవరకు పోరాటాన్ని ఢిల్లీకి పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పాలడుగు భాస్కర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనకు సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి జె.కుమారస్వామి అధ్యక్షత వహించారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, జె.మల్లిఖార్జున్, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, ఎం.వెంకటేశ్, కూరపాటి రమేశ్, పుప్పాల శ్రీకాంత్, పి.సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.సునీత, రొయ్యల రాజు, హైదరాబాద్ సీఐటీయూ నాయకులు టీ.మహేందర్, మరన్న, కృష్ణస్వామి, గోల్కొండ నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

