పట్టభద్రుల ఓటు నమోదుకు ఉచిత కేంద్రం
మడికొండలో ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం
అర్హులైన పట్టభద్రులు అవకాశాన్ని వినియోగించుకోవాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపు
కాకతీయ, కాజీపేట : అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. రాబోయే వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని మంగళవారం మడికొండ జంక్షన్లోని కార్యాలయంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పొనగోటి వెంకట్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యావంతులు, యువత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు నాయకులు తెలిపారు.
పట్టభద్రులు అవకాశాన్ని వినియోగించుకోవాలి
మడికొండ పరిసర ప్రాంతాల్లోని పట్టభద్రులు, యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి పొనగోటి వెంకట్ రావు కోరారు. అవసరమైన పత్రాలతో కేంద్రానికి వచ్చి తమ పేర్లను ఉచితంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కో-కన్వీనర్ దాస్యం అభినవ్ భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జలగం రంజిత్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు గడ్డం మహేందర్, మండల నాయకుడు చిన్నబోయిన శివ, బీజేవైఎం నాయకులు నిఖిల్ రావు, దార ధనుంజయ్, తాడం రంజిత్, గుండాల కళ్యాణ్, ఎలగొండ శివ, మిట్టపల్లి హేమంత్, నాయిని కుమార్, కొప్పిరాల సతీష్, పుల్యాల రవీందర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

