జన గణనలో ఒక్కరూ మినహాయింపుకు గురికావొద్దు
క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
బ్లాకుల మార్పులు, సాంకేతిక అంశాలపై అవగాహన
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ దిశానిర్దేశం
కాకతీయ, వరంగల్ : జనాభా గణన రెండో దశను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని బల్దియా ప్రత్యేకాధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిబంధనలు, ప్రశ్నావళి, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కేటాయించిన ప్రాంతాల్లో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి వివరాలు నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు అక్టోబర్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. మొదటి దశలో చేపట్టిన గృహాల జాబితా తయారీ బ్లాకులను జనాభా గణన బ్లాకులుగా మార్చడం, వెబ్ పోర్టల్ వినియోగం, బ్లాకుల కేటాయింపు, వివరాల నమోదుపై సూచనలు చేశారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం, మొదటి దశలోని లోపాలను సవరించడం, ప్రశ్నావళిలోని అంశాలను సరిగా నమోదు చేయడం, జనాభా వివరాల్లో వ్యత్యాసాలను గుర్తించి సరిచేయడంపై అవగాహన కల్పించారు. సెన్సస్ విభాగం హైదరాబాద్కు చెందిన సీహెచ్ సతీష్, జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్ ప్రశాంత్ శిక్షణ ఇచ్చారు. సీపీవో సత్యనారాయణ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా, ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు.

