వైద్య సేవల్లో ఉద్యోగుల పాత్ర కీలకం
ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
వేతన వ్యత్యాసాలు తొలగించి న్యాయం చేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
కాకతీయ, భూపాలపల్లి: ఎన్హెచ్ఎం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించారని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పించాలని కోరారు. ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని సమస్యలు పరిష్కారమై ఉండవచ్చని, మరికొన్ని పెండింగ్లో ఉండవచ్చని అన్నారు. గత ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకోకుండా, పరిష్కారం కాని సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన వ్యత్యాసాలను పరిశీలించి సమాన న్యాయం చేయాలని, అర్హులైన ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న వైద్య సిబ్బంది సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతని గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు.

