ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి
ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ఉద్యోగ భద్రత, వేతన సమస్యలపై తక్షణమే స్పందించాలి
మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్
కాకతీయ, హనుమకొండ: ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వారితో చర్చలు జరిపి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ప్రభుత్వ చీఫ్విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల పాత్ర కీలకమని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలతోపాటు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఎండా, వానా అనే తేడా లేకుండా సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఉద్యోగ భద్రత, వేతన సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగాల్సిన పరిస్థితి రావడం విచారకరమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలంటే ఆరోగ్య శాఖ ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల హక్కుల సాధనకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు తన మద్దతు కొనసాగుతుందని దాస్యం వినయ్ భాస్కర్ భరోసా ఇచ్చారు.

