క్రీడలతో శారీరక, మానసిక వికాసం
విద్యార్థి దశ నుంచే క్రీడల్లో శిక్షణ ఇప్పించాలి
నగర పోలీస్ కమిషనర్ శ్వేత
కాకతీయ, హనుమకొండ, అక్టోబర్ 14: విద్యార్థి దశ నుంచే పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇప్పించేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ములుగు రోడ్డులోని ఎల్బీ కళాశాలలో నిర్వహించనున్న మినీ సబ్ జూనియర్ బాలుర ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పి. సాంబశివరావు బుధవారం సీపీ శ్వేతకు వినతిపత్రం అందజేశారు. ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి బాలుర జట్లు పాల్గొంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి, క్రీడాకారులు పాల్గొన్నారు.

