రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు
హెవీ వాహనాల ఇష్టారాజ్యపు పార్కింగ్పై చర్యలు
బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
హసన్పర్తి, వంగపహాడ్ రహదారులపై భద్రతా చర్యలు
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి
కాకతీయ, హన్మకొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. రహదారుల పక్కన హెవీ వాహనాలు, ప్రైవేట్ ట్యాక్సీలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు భద్రతకు సంబంధించి చేపట్టిన చర్యలను ఆర్ అండ్ బీ ఈఈ దేవిక వివరించారు. కోమటిపల్లి పరిధిలోని జాతీయ రహదారిపై ట్రక్ లే-బై ఏర్పాటు, వంగపహాడ్ వద్ద ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను జాతీయ రహదారుల అధికారులు కలెక్టర్కు వివరించారు. రోడ్డు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా హెవీ వాహనాలు, ప్రైవేట్ ట్యాక్సీలను రహదారుల పక్కన నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. రహదారులపై లైన్ మార్కింగ్ స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతనంగా బీటీ రోడ్డు నిర్మించిన హసన్పర్తి వైపు లైన్ మార్కింగ్, రోడ్డు స్టడ్స్ ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల అధికారులకు సూచించారు. వంగపహాడ్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటి వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, జాతీయ రహదారుల మేనేజర్ లింగయ్య, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

