బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
మూడు జిల్లాల అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్
కాకతీయ, హైదరాబాద్ : గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు సహాయక పరికరాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, ఒక్క లబ్ధిదారుడూ మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల అధికారులతో హైదరాబాద్లోని సచివాలయం నుంచి మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు, సహాయక పరికరాల పంపిణీకి అర్హుల గుర్తింపు, శిబిరాల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద బతుకమ్మ ఘాట్ల వద్ద శుభ్రత, మట్టి పనులు, ఇతర అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి సూచించారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు. ఏర్పాట్ల విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అర్హుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి
హుస్నాబాద్ నియోజకవర్గంలో అలిమ్కో (ఏఎల్ఐఎంసీఓ) ఆధ్వర్యంలో ఏడీఐపీ (ఏడీఐపీ) పథకం కింద వృద్ధులు, దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ కోసం ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ప్రత్యేక శిబిరాల నిర్వహణపై సమాచారం క్షేత్రస్థాయి వరకు చేరిందా అనే అంశాలపై మంత్రి అధికారులను ఆరా తీశారు. గ్రామాల్లో డప్పు చాటింపుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారికి అవసరమైన సహాయక పరికరాలు అందేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో 2 మండలాలకు ఒక రోజు, హనుమకొండ జిల్లాలో 2 మండలాలకు ఒక రోజు, సిద్దిపేట జిల్లాలో 3 మండలాలకు 2 రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శిబిరాలకు ముందుగానే అర్హుల వివరాలను సేకరించి పూర్తి స్థాయి డేటా సిద్ధం చేయాలని, లబ్ధిదారులందరూ హాజరయ్యేలా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. డీఆర్డీఓ, పీడీ, డీడబ్ల్యూఓలతో పాటు జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు సహాయక పరికరాలు అందించడంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు.

