సారే కావాలంటున్నారు..
కేసీఆరే మళ్లీ రావాలంటున్నారు..
బీఆర్ఎస్ నాయకత్వాన్నే తెలంగాణ కోరుకుంటోంది
మూడేళ్లలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు
వరంగల్ జిల్లాపై మంత్రి పొంగులేటి పెత్తనం
ప్రజా సమస్యలపై కాకుండా కాంట్రాక్టులపైనే ఆయన సమీక్షలు
ఓరుగల్లులో మంత్రులున్నా ఇన్చార్జి మంత్రి మాటే చెల్లుబాటు
పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి
బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
కాకతీయ, హన్మకొండ : తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కాంట్రాక్టులు, పనుల కేటాయింపులపైనే సమీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. కాంట్రాక్టులు, పనుల కేటాయింపులపై సమీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ఓరుగల్లుకు చెందిన మంత్రులు ఉన్నప్పటికీ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనం కొనసాగుతోందని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల సమయంలో హనుమకొండ చౌరస్తాకు వచ్చి ఇచ్చిన రెండు హామీలపై శాసనమండలిలో ప్రశ్నిస్తే, మంత్రులే తమకు తెలియదని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాధ్యత వహించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం నిధుల విడుదల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని విమర్శించారు.
పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఓటరు నమోదు అత్యంత కీలకమని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాలకు చెందిన పట్టభద్రులు అధికంగా ఉన్న హనుమకొండలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరిసరాల్లోని పట్టభద్రులను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని కోరారు. మనసుపెట్టి పనిచేస్తే మూడు రోజుల్లోనే పెద్ద సంఖ్యలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు హనుమకొండ గుండెకాయ లాంటిదని, ఇక్కడి నుంచే నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజా ఉద్యమాల్లో బీఆర్ఎస్ ముందుంటుంది
ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ మూడేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. హనుమకొండలో తనతోపాటు పార్టీ శ్రేణులపై అణచివేతలు, కేసులు నమోదవుతున్నా ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ అండగా ఉంటుందనే నమ్మకం ఉందన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇప్పటికే డివిజన్లవారీగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని వివరించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ గెలుపుతో పార్టీకి కొత్త ఊపు
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే స్థానిక సంస్థల ఎన్నికలపైనా ప్రభావం చూపి, రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించకపోవడానికి బీఆర్ఎస్ గెలుస్తుందనే భయమే కారణమని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకులే వెనుకాడుతున్నారని వ్యాఖ్యానించారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనా గట్టి పోటీ ఇచ్చానని గుర్తుచేశారు. నిరుద్యోగుల పోటీ పరీక్షల్లో అవినీతి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ పోరాటం సాగించానని తెలిపారు. రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 12 నియోజకవర్గాల్లో ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి అర్హులైన పట్టభద్రులను నమోదు చేయించాలని సూచించారు. పండుగలు, ఇతర సందర్భాల్లో స్వగ్రామాలకు వచ్చే పట్టభద్రులను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని కోరారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర వృత్తుల్లో ఉన్న పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, రాష్ట్రస్థాయి నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

