భూ పరిహారం ముందే చెల్లించాలి
పంటలు ధ్వంసం చేయడాన్ని ఆపాలి
ఖరీఫ్ కోతలు పూర్తయ్యే వరకు భూములు తీసుకోవద్దు
రైతుల వాస్తవ నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి
ఏఐకేఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు
కాకతీయ, గీసుగొండ : నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించతలపెట్టిన 4 వరుసల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి కోసం రైతుల పంట పొలాలను ధ్వంసం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ముందుగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. శుక్రవారం గీసుగొండ మండలం గంగాదేవిపల్లి శివారులో పంట నష్టపోతున్న రైతుల భూములను రైతు సంఘాల నాయకులు సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న గంగాదేవిపల్లి శివారు ప్రాంతంలో రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పంటలను ధ్వంసం చేసేందుకు జాతీయ రహదారుల శాఖ, రెవెన్యూ అధికారులు ప్రయత్నించడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని కోరారు. ఒకే ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు వేర్వేరు గ్రామాల్లో వేర్వేరు విధాలుగా పరిహారం నిర్ణయించడం అన్యాయమని అన్నారు.
ఎకరాకు రూ.1.30 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో లేవని, రైతులు పత్తి, మొక్కజొన్నతో పాటు కూరగాయలు సాగు చేశారని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో పంటలకు డిమాండ్ ఉండటంతో కొంతైనా ఆదాయం వస్తుందని ఆశిస్తున్న రైతుల పంటలను ధ్వంసం చేయడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా పంట నష్టానికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు పరిహారం ఇస్తామని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, పంట దిగుబడి ద్వారా ఎకరాకు సుమారు రూ.1.30 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. రైతుల వాస్తవ నష్టాలను పరిగణనలోకి తీసుకొని తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ పంటల కోత పూర్తయ్యే వరకు రైతుల భూములను స్వాధీనం చేసుకోవద్దని, ముందుగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు సోమిడి సాంబయ్య, సిర్ల రవీందర్తో పాటు బాధిత రైతులు పెండ్లి చిన్న మల్లారెడ్డి, పెండ్లి సరోజన, రమేష్, ఎరుకల రమేష్, ప్రవీణ్, విమల తదితరులు పాల్గొన్నారు.

