కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు
కల్వకుంట్ల కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు
తెలంగాణ నినాదాన్ని స్వార్థం కోసం వాడుకున్న కేసీఆర్
ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమయ్యాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ విమర్శించారు. తెలంగాణ సాధన కోసం సబ్బండ వర్గాల ప్రజలు పోరాడితే, ఆ ఫలాలను మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత కష్టాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని, కేసీఆర్ ఆ నినాదాన్ని తన కుటుంబ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారని బల్మూరి వెంకట్ ఆరోపించారు. కాసుల కోసం కక్కుర్తిపడి నిర్మించాల్సిన చోట ప్రాజెక్టులు నిర్మించలేదని, కాళేశ్వరం నీళ్లు తన ఫామ్‌హౌస్‌కు చేరేలా ప్రణాళికలు రూపొందించుకున్నారని విమర్శించారు. నియామకాల విషయంలోనూ కుటుంబ సభ్యులు హరీశ్‌రావు, కేటీఆర్, కవిత, సంతోష్‌రావు, ఇతర బంధువులకు ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. నిధుల విషయంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ కాగా, బీఆర్ఎస్ ఖాతా విరాళాలతో నిండిందని బల్మూరి వెంకట్ విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిధులను దారి మళ్లించారని, భూములు, వ్యాపారాలను పెంచుకున్నారే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో కరువుకు ప్రజా ప్రభుత్వమే కారణమన్నట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం అవివేకమని అన్నారు. హరీశ్‌రావు చేస్తున్న ధర్నా రైతుల కోసం కాదని, వారి మామ ఫామ్‌హౌస్‌కు నీళ్లు అందించాలనే ఉద్దేశంతోనేనని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో ఏం జరిగిందో ప్రజలు గమనించే బీఆర్ఎస్ను అధికారానికి దూరం చేశారని పేర్కొన్నారు. నిపుణుల సలహాలు తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉంటే ప్రస్తుత కష్టకాలంలో అది ఉపయోగపడేదని అభిప్రాయపడ్డారు. గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుసని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు.

