కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి!
పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా?
ఎల్ఎండీ నుంచి సాగునీటి విడుదలకు డిమాండ్
మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో రాస్తారోకో
కాకతీయ, శంకరపట్నం : కోత దశకు చేరుకున్న వరి పంటలను కాపాడేందుకు ఎల్ఎండీ నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని రైతుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో నీటి కొరత ఏర్పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి కష్టపడి పండించిన వరి పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పంట కోతకు సిద్ధమైన తరుణంలో నీరు అందక నష్టపోతే రైతుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రైతుల కష్టాలను గుర్తించి ఎల్ఎండీ నుంచి తక్షణమే సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆందోళనలో మాజీ జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ ఆకుబత్తిని విజయ్‌కుమార్, నాయకులు కొత్తపెళ్లి రవి, గుర్రం శ్రీకాంత్‌గౌడ్, తాళ్లపెళ్లి శ్రీనివాస్‌గౌడ్, గొడిశాల రాములు, అలీమ్, గూళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

