నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!
జిల్లా యూత్ ప్రెసిడెంట్ బోర్డుతో ఇన్నోవా క్రిస్టా హల్చల్
నేతల వాహనాలకు నిబంధనలు వర్తించవా?
ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజల ప్రశ్నలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగర రోడ్లపై నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ఓ ఇన్నోవా క్రిస్టా వాహనం చర్చనీయాంశంగా మారింది. వెనుక నంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట ‘యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వరంగల్’ అనే బోర్డు ఏర్పాటు చేసి వాహనం తిరుగుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సామాన్య వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు విధిస్తుండగా, ఈ వాహనంపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. హోదా బోర్డు ఉన్నంత మాత్రాన వాహన నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందా? అని నిలదీస్తున్నారు. వాహనం ఎవరిది, దానికి సరైన రిజిస్ట్రేషన్ ఉందా, వెనుక నంబర్ ప్లేట్ ఎందుకు కనిపించడం లేదనే అంశాలపై పోలీసులు విచారణ జరపాలని కోరుతున్నారు. నంబర్ ప్లేట్ నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణ వాహనదారులకు ఒక రకంగా, రాజకీయ హోదా బోర్డులు ఉన్న వాహనాలకు మరో రకంగా నిబంధనలు అమలు చేస్తున్నారా? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ వాహనంపై ట్రాఫిక్ పోలీసులు స్పందించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.

