జోగాపూర్లో దొంగల చేతివాటం!
అర్ధరాత్రి భారీ చోరీ.. రూ.80 వేల నగదు సహా బంగారు, వెండి ఆభరణాలు స్వాహా!
ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువుల అపహరణ..
రంగంలోకి దిగిన పోలీసులు, ఆధారాల సేకరణ!
కాకతీయ, చందుర్తి:రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. రాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి నగదు, బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ఉదయం చోరీ విషయం వెలుగులోకి రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
నగదు.. బంగారం.. వెండి ఆభరణాలు మాయం!…
బాధితుడు ముత్యాల సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు రూ.80 వేల నగదుతో పాటు రెండు తులాల బంగారు నెక్లెస్, మూడు బంగారు చైన్లు, రెండు జతల కమ్మలు, రెండు ఉంగరాలు, మూడు జతల వెండి పట్టగొలుసులు, రెండు వెండి మొలతాడులను ఎత్తుకెళ్లారు. భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు అపహరణకు గురికావడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వేలిముద్రల నిపుణుల బృందం ఆధారాలను సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జోగాపూర్లో చోరీకి పాల్పడింది ఎవరు? దుండగులు ఎలా వచ్చారు? వారి ఆచూకీ ఎప్పుడు లభిస్తుంది? అనే అంశాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


