కార్మికుల జీతాలు పెంచాల్సిందే!
సిద్దిపేట స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమే
కాంగ్రెస్ పాలనలో మూడేళ్లుగా జీతాల పెంపు లేదు
అసెంబ్లీలో కార్మికుల పక్షాన పోరాడతా: మాజీ మంత్రి హరీశ్‌రావు
కాకతీయ, సిద్దిపేట : పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాల్సిందేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేటకు జాతీయ స్థాయిలో స్వచ్ఛత అవార్డులు రావడం తన గొప్పతనం కాదని, చలి, వానను లెక్కచేయకుండా శ్రమించిన పారిశుధ్య కార్మికుల కష్టానికి దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో కలిసి టిఫిన్ చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దసరా సందర్భంగా తన సొంత ఖర్చులతో మహిళా కార్మికులకు చీరలు, పురుష కార్మికులకు ప్యాంట్లు, షర్టులను అందజేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారిశుధ్య కార్మికులకు మూడు నుంచి ఆరు నెలల వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేదని హరీశ్‌రావు అన్నారు. నాడు రూ.8,300గా ఉన్న ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలను బీఆర్ఎస్ ప్రభుత్వంలో విడతలవారీగా రూ.12 వేలు, రూ.14 వేలు, చివరకు రూ.16,600కు పెంచామని వివరించారు. కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించి ఏడుగురు కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా ఖాతాల్లో జీతాలు జమ చేసే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని విమర్శించారు. మరోవైపు నిత్యావసరాలు, విద్యుత్ బిల్లులు, ఇళ్ల అద్దెలు, బస్సు చార్జీలు పెరిగాయని పేర్కొన్నారు. వంటనూనె, పప్పులు, ఉల్లిగడ్డలు, బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయని అన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో కార్మికులు వేతనాల పెంపు కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు.

కార్మికుల శ్రమ తగ్గించేందుకు చర్యలు
సిద్దిపేటలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, స్వీపింగ్ యంత్రాల ఏర్పాటు, చెత్తకుండీల తొలగింపు, ఇంటింటికీ చెత్త సేకరణ ఆటోల నిర్వహణతో పారిశుధ్య కార్మికుల శ్రమను తగ్గించామని హరీశ్‌రావు తెలిపారు. గతంలో మురుగు కాలువల్లోకి దిగి చెత్తను తొలగించాల్సి వచ్చేదని, భూగర్భ డ్రైనేజీతో ఆ ఇబ్బందులు తగ్గాయని చెప్పారు. చెత్తకుండీల చుట్టూ పందులు, కుక్కల వల్ల ఎదురయ్యే సమస్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. రీసైక్లింగ్ ద్వారా కార్మికులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలను కూడా కల్పించామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్నసాగర్ ద్వారా సిద్దిపేటకు నీరు అందుబాటులోకి రావడంతో నల్లా ఆపరేటర్లకు గతంలో ఎదురైన రాత్రింబవళ్ల కష్టాలు తగ్గాయని చెప్పారు. గతంలో విద్యుత్ సరఫరా అంతరాయాల వల్ల అర్ధరాత్రి, తెల్లవారుజామున నీటి సరఫరా చేయాల్సి వచ్చేదని గుర్తుచేశారు.
ఇతర కార్మికులకూ గ్రూపు విధానం
పారిశుధ్య కార్మికులతోపాటు నల్లా ఆపరేటర్లు, మొక్కలు నాటే కార్మికులకూ గ్రూపు విధానాన్ని వర్తింపజేసి నేరుగా జీతాలు చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన పీఎఫ్, ఈఎస్ఐ, బ్యాంకు ఖాతాల సమస్యలను మున్సిపల్ అధికారులు, చైర్మన్ సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని కోరారు.
కరోనా సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనా పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందించారని గుర్తుచేశారు. అలాంటి కార్మికుల వేతనాలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని, న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడతానని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

