రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు!
* కబడ్డీ, వాలీబాల్తో పాటు 200 మీటర్ల పరుగులోనూ ప్రతిభ
కాకతీయ,చేర్యాల:
సిద్దిపేట జిల్లా చేర్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్ జట్లకు విద్యార్థులు ఎంపిక కాగా, 200 మీటర్ల పరుగుపందెంలోనూ ఓ విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సిద్దిపేటలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన పీఎం శ్రీ జిల్లాస్థాయి అండర్-17 క్రీడా పోటీల్లో చేర్యాల గురుకుల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఆయా పోటీల్లో ద్వితీయ బహుమతులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ క్రమంలో కబడ్డీ, వాలీబాల్ రాష్ట్రస్థాయి జట్లకు విద్యార్థులు ఎంపికయ్యారు. దృశ్యంత్ అనే విద్యార్థి 200 మీటర్ల పరుగుపందెంలో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.ఈ సందర్భంగా శనివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ పోలోజు నరసింహాచారి, ఫిజికల్ డైరెక్టర్ సురేష్, పీఈటీ రేణుకతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో క్రీడల్లో రాణించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

