అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి కొనుగోళ్లు
తేమ తగ్గితేనే మద్దతు ధర
వరంగల్ జిల్లాలో 27 కొనుగోలు కేంద్రాలు
కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి కలెక్టర్ సత్యశారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రైతుల నుంచి నేరుగా మద్దతు ధరకు పత్తిని సేకరించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా వరంగల్ జిల్లాలో 27 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని 27 జిన్నింగ్ మిల్లుల్లో నిర్వహించేందుకు నోటిఫై చేసింది. అక్టోబర్ రెండో వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద వెల్లడించారు.
2026-27 పత్తి సేకరణ సీజన్ ను పురస్కరించుకుని మంగళవారం వరంగల్ కలెక్టరేట్లో జిన్నింగ్ మిల్లుల యజమానులు, సీసీఐ ప్రతినిధులు, రైతు సంఘ నాయకులు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పత్తి పంటకు కనీస మద్దతు ధర దక్కాలన్నా, దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండాలన్నా అవగాహనే శరణ్యం. రైతులు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండకుండా ‘కపాస్ కిసాన్’ యాప్ ను అందుబాటులోకి తెచ్చాం. రైతులు ముందుగానే యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, కేటాయించిన తేదీలో మాత్రమే విడి పత్తిని మిల్లులకు తీసుకురావాలి. విక్రయ సమయంలో ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పట్టాదార్ పాస్ బుక్ తప్పనిసరిగా తేవాలి.
నాణ్యతే కీలకం…….: మద్దతు ధర పొందడానికి నాణ్యత అత్యంత కీలకం. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 శాతానికి మించకుండా ఆరబెట్టుకోవాలి. ఎఫ్ఏక్యూ ప్రమాణాలు పాటిస్తే క్వింటాలుకు రూ.8,667 కనీస మద్దతు ధర లభిస్తుంది.
అగ్నిమాపక భద్రతపై ఆడిట్: కొనుగోలు కేంద్రాలుగా వ్యవహరించే జిన్నింగ్ మిల్లుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తప్పనిసరి. నోటిఫై చేసిన అన్ని మిల్లులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి భద్రతా నివేదిక ఇవ్వాలని జిల్లా అగ్నిమాపక అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, అగ్నిమాపక అధికారి యజ్ఞనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, లీగల్ మెట్రాలజీ, మార్కెటింగ్ శాఖ అధికారులు, సీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

