గిరిజన దర్బార్లో ప్రజల సమస్యలు విన్న ఐటీడీఏ పీఓ
30 దరఖాస్తులు స్వీకరించిన లెనిన్ వత్సల్ టోప్పో
నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను వివరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. దర్బార్లో మొత్తం 30 దరఖాస్తులు అందాయి. ఇందులో ఇందిరా జల ప్రభకు 8, ఆర్సీఓ మహబూబాబాద్ పరిధిలో 6, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ విభాగానికి 6, డీటీ ఆర్ఓఎఫ్ఆర్కు 3, ఎస్డీసీకి 2, డీడీ ట్రైబల్ వెల్ఫేర్, వెంకటాపురం తహసీల్దార్, ఎస్సీ కార్పొరేషన్, సీహెచ్సీకి ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగాలు, డిప్యూటేషన్, కారుణ్య నియామకాలు, రోడ్లు, భవన నిర్మాణాలు, పైప్లైన్ పనులు, రోడ్డు రోలర్ మంజూరు తదితర అంశాలపై దరఖాస్తులు అందాయి. శ్రీ ఆంజనేయ ట్రైబల్ సాండ్ క్వారీ కోఆపరేటివ్ సొసైటీలో సుమారు 40 మంది సభ్యులను తొలగించారన్న ఫిర్యాదును సంబంధిత అధికారికి విచారణ కోసం పంపించారు. కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ జనార్ధన్, ఏపీఓ ప్రతాప్, ఈఈ ప్రవీణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

