శ్మశాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి
దళితుల సమాధుల ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి
శంకరపట్నం సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ డిమాండ్
కాకతీయ, శంకరపట్నం: కేశవపట్నం గ్రామంలో ధ్వంసమైన దళితుల సమాధులను గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ నేతకాని కుల సంఘం పెద్దమనుషులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల సమాధులను ధ్వంసం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ఘటనను కేవలం సమాధుల ధ్వంసంగా కాకుండా దళిత సమాజంపై జరిగిన దాడిగా పరిగణించి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితుల సమాధుల విషయంలోనూ కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్మశాన వాటికలకు కేటాయించిన భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు స్మశాన భూముల హద్దులను గుర్తించి స్పష్టమైన మార్కింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. సమాధుల ధ్వంసంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గొల్లిపెల్లి శ్రీనివాస్, దుర్గం నరేష్, మారుతి, నరేష్, బిక్షపతి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు

