బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానం
ఆరు, తొమ్మిదో తరగతి జవాబు పత్రాల పరిశీలన
నిర్ణీత గడువులో మూల్యాంకనం పూర్తి చేయాలి
ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి మందుల శ్రీరాములు
కాకతీయ, నెల్లికుదురు : ఆరు, తొమ్మిదో తరగతి సమ్మేటివ్ అసెస్మెంట్–1 విద్యార్థుల జవాబు పత్రాల బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానమని ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి, ఏసీజీఈసీ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు అన్నారు. మండల కేంద్రంలోని నెల్లికుదురు ప్రాథమిక పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న బాహ్య మూల్యాంకన ప్రక్రియను మంగళవారం జిల్లా బృందం పరిశీలించింది. భాషా మూల్యాంకనానికి నియమించిన మూల్యాంకనకర్తల సంఖ్య, ఆరు, తొమ్మిదో తరగతుల విద్యార్థుల సంఖ్య, ఇప్పటివరకు పూర్తయిన సబ్జెక్టుల మూల్యాంకనం తదితర వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. మూల్యాంకన కేంద్రం ఇన్చార్జి నుంచి జవాబు పత్రాల పంపిణీ, మూల్యాంకనం అనంతరం మార్పులను నమోదు చేసే నిర్దిష్ట నమూనా తదితర వివరాలను సేకరించారు. షెడ్యూల్ ప్రకారం నిర్ణీత గడువులో మూల్యాంకనం పూర్తి చేయాలని, అనంతరం మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మూల్యాంకన కేంద్రం ఇన్చార్జి ఈ. కరుణాకర్, పి. పనీంద్ర, కేంద్ర ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, మూల్యాంకనకర్తలు, మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ మస్కపురి సుధాకర్, కంప్యూటర్ ఆపరేటర్ హెచ్. ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

