జర్నలిజంపై దాడులు సహించం
వర్ధన్నపేట ఎమ్మెల్యేకు జర్నలిస్టుల హెచ్చరిక
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మీడియా సంస్థ దిష్టిబొమ్మ దహనానికి నిరసనగా వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలిలో జర్నలిస్టులు మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.ప్రశ్నించే నాలుగో స్తంభంపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగడం దారుణమని, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నాలుగు సార్లు ఇలాగే జరిగింది
ఈ సందర్భంగా వరంగల్ తూర్పు పరపతి సంఘం అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ, పత్రికా స్వేచ్ఛను హరించే ఇలాంటి ఘటనలు ఇప్పటికి నాలుగు సార్లు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, జర్నలిజంపై జులుం నడవదని హెచ్చరించారు.
వార్తలపై అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధ మార్గాలు ఉన్నాయని, దిష్టిబొమ్మలు తగలబెట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదని జర్నలిస్టు సంఘాల నాయకులు మండిపడ్డారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, ఎమ్మెల్యే క్షమాపణ చెప్పే వరకు నిరసనలు ఆపబోమని స్పష్టం చేశారు.

