లక్ష్మీపురం మార్కెట్లో బకాయి బాగోతం!
నాలుగు షాపులపై కోర్టు వివాదం.. అయినా కొనసాగుతున్న వ్యాపారం
రూ.39.82 లక్షల బకాయిలు..ఆరేళ్లుగా కొత్త టెండర్లు లేవు..
బకాయిదారులకు ఆక్షన్ మినహాయింపు ఎందుకు?
మార్కెట్ అధికారుల తీరుపై రైతుల ప్రశ్నలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : షాపులు దక్కించుకునేందుకు పోటాపోటీగా వేలం.. ఆ తర్వాత కిరాయిల చెల్లింపులో చేతులెత్తేయడం.. బకాయిలు పేరుకుపోయినా చర్యలు మాత్రం కొందరిపైనే! వరంగల్ ఏనుమాముల పరిధిలోని లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్లో కమర్షియల్ షాపుల బకాయిల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం 30 షాపుల్లో ఒకదాన్ని మార్కెట్ కార్యాలయానికి కేటాయించగా, మిగిలిన 29 షాపుల నుంచి రావాల్సిన బకాయిలు రూ.39,82,187కు చేరినట్లు మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు బకాయిల వసూళ్లలోనూ ఒకే విధానం పాటిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో అప్పటి మార్కెట్ పాలకవర్గం 29 కమర్షియల్ షాపులకు బహిరంగ టెండర్లు నిర్వహించింది. షాపుల పరిమాణాన్ని బట్టి 7 షాపులకు నెలకు రూ.3,850, 22 షాపులకు రూ.4,200 కనీస కిరాయిగా నిర్ణయించారు. అయితే టెండర్లో పోటీ పెరగడంతో కొందరు వ్యాపారులు కనీస ధర కంటే ఆరు రెట్లకు పైగా చెల్లించేందుకు ముందుకొచ్చారు. కొన్ని షాపులకు నెలకు రూ.27 వేల వరకు కిరాయి కోట్ చేసి దక్కించుకున్నారు. ప్రతి షాపుదారుడి నుంచి రూ.50 వేల చొప్పున డీడీ రూపంలో ముందస్తు మొత్తాన్ని కూడా వసూలు చేసినట్లు సమాచారం.

రెండు నెలలకే బకాయిల పర్వం
షాపులు దక్కించుకున్న వ్యాపారులు మొదటి ఒకటి, రెండు నెలలు కిరాయిలు చెల్లించిన తర్వాత బకాయిలు పేరుకుపోయినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. అధికారులు పలుమార్లు ఒత్తిడి తెచ్చి కొంత మొత్తం వసూలు చేసినప్పటికీ భారీగా బకాయిలు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. 2023లో కిరాయి చెల్లించని ఏడుగురు షాపుదారులను తొలగించి, ఆయా షాపులకు మళ్లీ టెండర్లు నిర్వహించినట్లు సమాచారం.
అయితే అందరిపైనా ఒకే రకమైన చర్యలు తీసుకున్నారా? లేక కొందరికి మాత్రమే మినహాయింపులు లభించాయా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. షాపు నంబర్లు 6, 7, 15, 18కు సంబంధించిన నలుగురు వ్యాపారులు కిరాయి చెల్లించలేమంటూ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వీరి వద్ద నుంచి రావాల్సిన బకాయిలే రూ.26,67,600గా ఉన్నట్లు మార్కెట్ రికార్డులు పేర్కొంటున్నాయి. కోర్టు వివాదం నేపథ్యంలో ఆయా షాపులపై మార్కెట్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంది? అన్నది ప్రశ్నగా మారింది. నిబంధనల ప్రకారం కోర్టు వివాదం కొనసాగుతున్న సమయంలో షాపుల నిర్వహణపై స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. అక్కడ వ్యాపారం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
తొమ్మిది మందికి ఎందుకు మినహాయింపు?
మిగిలిన 25 షాపుల్లో 8, 11, 13, 19, 20, 21, 26 నంబర్లతో ఉన్న ఏడు షాపులను బకాయిల కారణంగా ఓపెన్ ఆక్షన్‌కు పంపినట్లు సమాచారం. వీటి నుంచి రావాల్సిన బకాయి రూ.4,03,540గా ఉంది. మరో 18 షాపుల నుంచి రూ.9,11,047 బకాయి రావాల్సి ఉంది. ఇందులో షాపు నంబర్లు 4, 9, 12, 17, 24, 27, 28, 29, 30కు చెందిన తొమ్మిది మంది వ్యాపారుల వద్ద రూ.50 వేల నుంచి రూ.98 వేల వరకు బకాయిలు ఉన్నట్లు మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. అయినప్పటికీ వీరిని ఓపెన్ ఆక్షన్ జాబితాలో ఎందుకు చేర్చలేదన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
బకాయి ఉన్న ఏడుగురిని వేలానికి పంపి.. అంతకంటే ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్న మరికొందరిని ఎందుకు మినహాయించారన్న దానిపై మార్కెట్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 2021లో కమర్షియల్ షాపులకు టెండర్లు నిర్వహించిన తర్వాత 2026 వరకు కొత్తగా అన్ని షాపులకు టెండర్లు నిర్వహించకపోవడంపైనా రైతులు, వ్యాపార వర్గాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. కిరాయిలు సక్రమంగా రాకపోయినా షాపులను కొనసాగించడం వెనుక కారణమేంటి? బకాయిల వసూళ్లకు మార్కెట్ యంత్రాంగం తీసుకున్న చర్యలేంటి? ఒకే విధమైన బకాయిదారులపై ఒకే రకమైన చర్యలు ఎందుకు లేవు? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలని రైతులు కోరుతున్నారు. రూ.39.82 లక్షల బకాయిల వ్యవహారంలో షాపుల వారీగా వసూళ్లు, కోర్టు కేసులు, వేలం జాబితా, మినహాయింపులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

