ప్రేమ పెళ్లిలో శ్రీదేవి విజయం
4 రోజుల యువతి దీక్ష పోరాటానికి తెర
దిగి వచ్చిన వర్ధన్నపేట మునిసిపల్ చైర్మన్ కుటుంబ సభ్యులు
మీడియా, సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చతో ఒత్తిడి
సామాజిక కార్యకర్తల చొరవతో ఇరు కుటుంబాల మధ్య సయోధ్య
చివరకు అందరి సమక్షంలో శ్రీదేవిని వివాహమాడిన శ్రీకాంత్
కాకతీయ, వర్ధన్నపేట : తాను ప్రేమించిన పాలకుర్తి శ్రీకాంత్‌తోనే వివాహం జరిపించాలని పట్టువిడవకుండా 4 రోజులుగా పోరాటం చేసిన దళిత యువతి తుమ్మల శ్రీదేవి చివరకు తన లక్ష్యాన్ని సాధించింది. ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సబ్బండ వర్గాలు ఆమెకు అండగా నిలవడంతోపాటు మీడియా కథనాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరగడంతో ఇరు కుటుంబాలపై ఒత్తిడి పెరిగింది. చివరకు ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరి ప్రేమికుల వివాహానికి మార్గం సుగమమైంది. శ్రీకాంత్ తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి చైర్మన్ కుటుంబం ఇంటి ఎదుట 4 రోజులుగా దీక్ష కొనసాగించింది. రాత్రింబవళ్లు అక్కడే ఉంటూ తన డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. పలువురు నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు దీక్షా స్థలానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు.

రాజకీయంగా మారిన వ్యవహారం
వ్యవహారం రోజురోజుకూ తీవ్రతరం కావడంతో అధికార కాంగ్రెస్‌లోనూ చర్చకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం శ్రీదేవికి మద్దతు ప్రకటించారు. దీంతో ఈ అంశం కుటుంబ వ్యవహారం నుంచి సామాజిక, రాజకీయ అంశంగా మారింది. మీడియా కథనాలు, సామాజిక మాధ్యమాల చర్చలతో రాష్ట్రస్థాయిలోనూ దృష్టిని ఆకర్షించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జోక్యం చేసుకున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్‌రావుతో కలిసి ఇరు కుటుంబాలతో చర్చలు జరిపారు. పెద్దల సమక్షంలో చర్చలు జరిపి ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహానికి మార్గం సుగమం చేశారు. ఈ మేరకు అంగీకార పత్రం కూడా రాసుకున్నట్లు సమాచారం.
అందరి సమక్షంలో శ్రీదేవి మెడలో పసుపుతాడు
చర్చలు సఫలం కావడంతో చైర్మన్ కుటుంబం వివాహానికి అంగీకరించింది. శ్రీకాంత్, తుమ్మల శ్రీదేవి ఇంటి వద్ద పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం పసుపుతాడు కట్టడంతో 4 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. త్వరలో పెద్దల సమక్షంలో శాస్త్రోక్తంగా వివాహం నిర్వహించి, అనంతరం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండా, వానా లెక్కచేయకుండా 4 రోజులపాటు దీక్ష కొనసాగించిన శ్రీదేవి చివరకు తాను కోరుకున్న వ్యక్తితో వివాహానికి అంగీకారం సాధించడంతో ఆనందం వ్యక్తం చేసింది. తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకునే హక్కు కోసం సాగిన పోరాటానికి ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, మీడియా, సామాజిక మాధ్యమాల నుంచి లభించిన మద్దతు కీలకంగా మారింది. ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించడంతో ఈ వ్యవహారం సుఖాంతమైంది.

